విలేజ్ క్లినిక్ లకు 104లు అనుసంధానం..
Ens Balu
3
Tadepalle
2021-02-25 08:06:11
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రజలకు గ్రామాల్లోనే ప్రాధమిక వైద్యం అందించాలని ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్ లకు 104ను అనుసంధానం చేయాలని భావిస్తుంది. తద్వారా ఒక్కో విలేజ్ క్లినిక్ పరిధిలో ఒక్కోరోజు మెడికల్ క్యాంపులు ప్రతీనెలా కానీ ప్రతీ 15 రోజులకు ఒకసారిగాని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాల రోగాలతోపాటు, రక్తపరీక్షలు కూడా గ్రామాల్లో చేయాలని చూస్తున్నట్టు సమాచారం. సుమారు 90 రకాల మందులు విలేజ్ క్లినిక్ లలో అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు వేస్తున్న వేక్సిన్లను కూడా ఇకపై విలేజ్ క్లినిక్ లలోనే వేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, సచివాలయ ఏఎన్ఎంలకు ట్యాబులు, రక్త పరీక్షలు(హీమోగ్లోబిన్ పరీక్షలు చేసే)కిట్లను అందించిన ప్రభుత్వం గ్రామంలో అందరికీ వాటితోనే పరీక్షలు చేయించనుంది. సుగర్ పరీక్షలకు కూడా ప్రత్యేకంగా కిట్లను అందజేసి ఆరోగ్య సహాయకులతోనే పరీక్షలు చేయించాలని భావిస్తోందట. అంటే చాలా వరకూ విలేజ్ క్లినిక్ లలో ల్యాబ్ టెక్నీషియన్ అవసరం లేకుండానే కొత్తగా నియమించే స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంలతోనే వాటిని నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఆరోగ్య సహాయకులుగా బిఎస్సీ నర్సింగ్ చేసిన వారిని నియమిస్తారు. వారితోపాటు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంలు వీరితోపాటే విలేజ్ క్లినిక్ లలోనే సేవలు అందిస్తారు. నెలకొకసారి 104 ద్వారా డాక్టర్లు బ్రుందం వచ్చినపుడు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. అత్యవసరం అయితే ఎలగూ 108 వాహనాలకు విలేజ్ క్లినిక్ ల నుంచే ఫోన్ చేసి వాటిని రప్పిస్తారు. ఇలా 104, 108 అంబులెన్సులు కూడా ప్రజలకు అత్యవసర సేవలకు ఉపయోగ పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ క్లినిక్ ల నిర్మాణం జరుగుతుండగా, ఏప్రిల్ లో లేదా మే నెలలో దీనికి సంబంధించిన స్టాఫ్ నర్సుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విలేజ్ క్లినిక్ ల నిర్మాణం జరిగి సిబ్బంది అందుబాటులోకి వస్తే గర్భిణీ స్త్రీలు ఒక్క కాన్పులకు మాత్రమే పీహెచ్సీలకు, గానీ, ఏరియా ఆసుపత్రులకు గానీ వెళ్లే పనుంటుంది. అంతవరకూ ప్రాధమిక వైద్యం మొత్తమంతా ఇక్కడ పనిచేసే ఆరోగ్య సహాయకులతోనే ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే విలేజ్ క్లినిక్ ల ద్వారా సుమారు 11274 మందికి కొత్తగా స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ కేంద్రానికి కూడా ఒక కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, వెబ్ కెమెరా తదితర సామాగ్రి ఇచ్చి పీహెచ్సీ స్థాయిలోగానీ, ఏరియా ఆసుపత్రి స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలోగానీ, రాష్ట్రస్థాయిలో గానీ అందుబాటులో ఉండే వైద్యులతో రోగుల రోగాలకు అనుగుణంగా మందులను ఇచ్చేందుకు వీలుగా టెలీమెడిసిన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే విధంగానే వీటి నిర్మాణాలు జరుగుతున్నాయని సమాచారం. గ్రామసచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లతోపాటు, వెటర్నరీ క్లినిక్ లు కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఒకప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా పీహెచ్సీలకు కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లిని అక్కడ పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కాదు. వీటిని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వా ఆ ఇబ్బందులను ప్రజలకు ఉపసమనం కల్పించడానికి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విలేజ్ క్లినిక్ వ్యవస్థతో గ్రామస్తులకు గ్రామంలోనే ప్రాధమిక వైద్యం అందే సూచనలు కనిపిస్తున్నాయి.