విశాఖలో 9 ఎకరాల్లో ఐటిపార్కు..


Ens Balu
2
Tadepalle
2021-02-26 14:54:13

విశాఖలో త్వరలోనే మిలీనియం టవర్ పక్కన భారీ ఐటి పార్కు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. ఈమేరకు సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎక్కువ ఉద్యోగాలందించేందుకు అవకాశం ఉన్న ఏకైక శాఖ ఐ.టీ శాఖ మాత్రమేనన్నారు. ప్రతీ ఏటా బయటకు వస్తున్న ఇంజనీరింగ్ పట్టభద్రులే కాకుండా, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు కూడా ఐటీ లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దీనికోసం  విశాఖపట్నంలోని మిలీనియం టవర్ సమీపంలో ఐ.టీ పార్కు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని అన్నారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్ తరహాలో ఐ.టీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు అధికారులను ఆదేశించినట్టు మంత్రి వివరించారు. యువత గర్వంగా చెప్పుకునే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  ఆధారిత ఉద్యోగాలందించాలన్నదే  తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఐటి ఉద్యోగాలకు అనుగుణంగా ముందస్తుగానే ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆయా టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏ టెక్నాలజీల్లో ఉద్యోగాలొస్తున్నాయో గుర్తించి నిరుద్యోగ యువతకు అందులో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఐటీ ఉద్యోగాలు సత్వరమే రావడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. దానికోసం నైపుణ్యాభివ్రుద్ధి సంస్థ ద్వారా శిక్షణలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను కోరామన్నారు.. ఐ.టీ పార్కు అభివృద్ధితో వీలైనన్ని ఎక్కువ నాణ్యమైన ఉద్యోగాలందింస్తామని  రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు.