ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమ స్నానం..
Ens Balu
1
Tirumala
2021-02-26 19:19:10
తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్లీనంగా సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదుల సంగమ స్థానమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.