ఆ జీఓ విషయంలో కలెక్టర్లూ చేతులెత్తేశారు..
Ens Balu
1
Tadepalle
2021-02-28 11:21:44
భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ నాటి పంచాయతీ కార్యదర్శిలకు చాలా ఇబ్బందులను, నొప్పులను తెచ్చిపెడుతోంది. గ్రామసచివాలయాలు ఏర్పాటై 16 నెలలు పూర్తవుతోంది. మరో 8నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబోతుందికూడా అంటే ఆ సమయానికి కార్యదర్శిల ఉద్యోగాలు కూడా ప్రొబిషన్ పూర్తిచేసుకొని రెగ్యులర్ కూడా కాబోతున్నాయి. అంతవరకూ బాగానే వున్న సచివాలయాల సేవలను ప్రజలకు అందించే విషయంలో జిల్లా కలెక్టర్లు, ఈ శాఖకోసం ప్రభుత్వం నియమించిన జెసిలు ప్రభుత్వం విడుదల చేసిన జీఓల అమలు విషయంలో చేతులెత్తేస్తున్నారు. అవును నిజమే ప్రభుత్వం మేజర్ పంచాయతీలు ఉన్నచోట రెండు నుంచి మూడు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ..ఏ సచివాలయ పరిధిలోని ప్రజలు ఆ సచివాలయంలోకే వస్తారని విభజన కూడా చేసి సేవలు అక్కడి నుంచే అందిస్తోంది. దానికి కార్యరూపం తీసుకురావడానికి జీఓ నెంబరు 149ను విడుదల చేసింది. దీని ప్రకారం మేజర్ పంచాయతీగా ఉన్న కార్యాయంలోని అన్ని అంశాలు విభజన చేయాల్సి వుంది. అంటే బ్యాంకు అకౌంట్లు, కార్యాలయం, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాహనాలు ఇలా అన్ని రకాల అధికారాలు ఆ జీఓ ప్రకారం విభజన చేయాలి. జీఓ వచ్చి రెండేళ్లు దాటి, దానిపై సర్క్యులర్ వచ్చి 8 నెలలు దాటుతున్నా ఆ జీఓ రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ అమలు కాలేదు.. కాదు కాదు ఏ జిల్లా కలెక్టరు గానీ, డీపీఓగానీ, జిల్లా పరిషత్ సీఈఓ గానీ దాని అమలు విషయంలో ఎంపీడీఓలకు దిశా నిర్ధేశం చేయలేదు. ఫలితంగా మేజర్ పంచాయతీల్లో సచివాలయాలు అయతే ఉన్నాయి తప్పితే వాటి ద్వారా ప్రజలకు సేవలు అందడటం లేదు. కార్యదర్శిలు అధికారాలు లేని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం పంచాయతీలకు సర్పంచ్ లు వచ్చిన తరుణంలో ఆ ఇబ్బందులు ఇపుడు మరింత ఎక్కువ కానున్నాయి. ప్రభుత్వం జీఓ విడుదల చేసినంత మాత్రాన తాము విభజన చేయాలా అనుకున్నారో ఏమో అటు జిల్లా పంచాయతీ అధికారులు ఈ జీఓపై ఎంపీడీఓలకు సైతం ఆదేశాలు జారీ చేయలేదు. వాస్తవానికి ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేస్తే దానిని జిల్లా అధికారులు తూచా తప్పకుండా పాటించాలి..కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలు ప్రభుత్వం విడుదల చేసే జీఓల అమలు విషయంలో భిన్నంగా ఉంటారు. ఇపుడు వారిని గట్టిగా ఆదేశించలేరని స్థాయిలో జిల్లా కలెక్టర్లుకూడా ఉంటారనే విషయం జిఓనెంబరు 149 మరోసారి రుజువు చేసింది. మీరు చదువుతున్నది నిజమే.. జీఓ నెంబరు 149పై సర్క్యులర్ వచ్చి సుమారు 8నెలలు అవుతున్నా దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఒక్క జిల్లాలోనూ గ్రామసచివాలయాల విభజన జరగలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం అమలు చేసే జీఓల విషయంలో జిల్లా కలెక్టర్లుగానీ, గ్రామసచివాలయ వ్యవస్థకు ఏర్పాటైన జాయింట్ కలెక్టర్లు గానీ చాలా ముక్కుసూటిగా ఉంటారు. కానీ విచిత్రం ఏంటో ఈ జీఓ విషయంలో అందరూ ఏకమై జీఓని అమలు చేయకుండా వదిలేశారు. కడప జిల్లాలో గ్రామసచివాలయ శాఖ జెసి గట్టిగా పట్టుబట్టి సచివాలయాలను విభజన చేయిస్తున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో కనీసం చలనం రావడంలేదు. ఈ క్రమంలో అధికారం లేని ఉద్యోగం తాము ఎలా చేస్తామంటూ సచివాయ కార్యదర్శిలు వాపోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా విధులు చేయమంటే తాము ఆవిధంగా పనిచేస్తున్నామని, కాకపోతే సత్వర నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం సచివాలయాల విభజన జరగకపోతే మాత్రం ప్రజలకు తమ సచివాలయాల పరిధిలో సేవలు అందించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారికి ద్రుష్టికి జీఓ విషయమై కార్యదర్శిలు తీసుకెళ్లినప్పటికీ, జిల్లా పంచాయతీ అధికారి ఒక అర్జెంట్ సర్క్యులర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే.. ఫలితం ఏమీ లేకుండా పోయింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ అమలు కానప్పుడు ప్రభుత్వం ఆ జీఓను ఎందుకు విడుదల చేసిందనే ప్రశ్నకూడా ఉత్పన్నమవుతుంది. గ్రామ సచివాలయాల కోసమే ప్రభుత్వం నియమించిన గ్రామసచివాలయాల శాఖ జాయింట్ కలెక్టర్లు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోవడం అశ్చర్యానికి, అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ప్రస్తుతం విభజన చేయని గ్రామసచివాలయల సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలు కొత్తగా వచ్చిన సచివాలయ కార్యదర్శిలు తమ కిందే పనిచేయాలని, వారితో మమ్మల్ని ఎలా సమానంగా చూస్తారని వాపోతున్నారు. వెరసీ జీఓనెంబరు 149 అమలుకి నోచుకోలేదు. ఒక ప్రక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశానికే గ్రామసచివాలయ వ్యవస్థ ఆదర్శంగా నిలువాలని పదే పదే ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నా.. ఇదే సచివాలయశాఖ జారీచేసిన జీఓని అమలు చేయకుండా గాలితీసేస్తున్న పరిస్థితిలో ఉన్నతాధికారులు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 13జిల్లాల్లో ప్రభుత్వ జీఓలు అమలు చేసే జిల్లా కలెక్టర్లు కొంతమంది ఉన్నప్పటికీ వారు కూగా ఈ జీఓ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ని నెలలు దాటుతున్నా నేటివరకూ ఆ జీఓ 149ని ఎంతమంది అమలు చేశారని ప్రశ్నించలేదంటే అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని అటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగానీ, మంత్రి బొత్సా సత్యన్నారాయణలు వంటి వారు కూడా పట్టించుకోలేదు. భవిష్యత్తులోనైనా పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి మరి..!