రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు..
Ens Balu
3
Visakhapatnam
2021-03-03 17:20:14
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా లబ్దిదారులు రేషన్ తీసుకొనే విధంగా పోర్టబిలిటీ ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగా ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థపైన, పంపిణీలో ఉన్న సమస్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 50 లక్షల మందికి ప్రతీ నెల క్రమం తప్పకుండా నిత్యవసర సరకులు అందించండం గొప్ప విషయమన్నారు. సంచార వాహన యూనిట్లు ద్వారా నిత్యవసర సరకులు తీసుకొనే సౌకర్యం పొందడానికి వీలుగా వాలంటీర్లు ముందు రోజు కూపన్లు పంపిణీ చేసి సరకులు పంపిణీ విషయమై తెలియజేస్తారన్నారు. సరకులు సక్రమంగా సకాలంలో పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సందర్శించిన సమయంలో కార్డు దారులు యొక్క సంతృప్తి స్థాయిని ఆయన పరిశీలించగా, సరియైన తూకంతో నాణ్యమైన సరకులు అందుతున్నాయని కార్డుదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఎం.డి. ఆపరేటర్లు పని వదిలిపెట్టినట్లైతే వెంటనే ఆశక్తి గల వారితో భర్తీ చేసి నిరంతరాయంగా పంపిణీ జరిగేటట్లు చూడాలని ఆదేశించారు. ఎం.డి.యు. లో ఉన్న తూనిక యంత్రాలను మరల ఒక సారి తనిఖీ చేసి ఒక వేళ మరమ్మత్తులు ఏమైనా ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని తూనికలు, కొలతలు శాఖ ఉప నియంత్రణాధికారిని ఆదేశించారు. ప్రతీ రోజు రోజంతా పంపిణీ జరిపితే సచివాలయం వద్ద లేదా అందరికీ అనువైన ప్రదేశంలో సాయంత్రం 6 గంటలు నుండి 7 గంటలు వరకు వాహనం నిలిపి కార్డు దారులకు నిత్యవసర సరకులు పంపిణీ చేయాలన్నారు. వాలంటీరు తన పరిధిలో గల కార్డుదారులు గుమిగూడకుండా పంపిణీ చేస్తే సమస్యలు ఉండవన్నారు. ఏజన్సీలో కార్డు దారులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే రేషన్ చేర్చడానికి ఐ.టి.డి.ఎ. పి.ఓ.తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని పాడేరు ఆర్.డి.ఓ. లక్ష్మీ శివ జ్యోతిని ఆదేశించారు. ప్రభుత్వం సరియైన తూకంతో నాణ్యమైన సరకులు అందిస్తున్నట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ కలెక్టర్, ఆర్డిఓల అభిప్రాయాలను తీసుకున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో జరుగుచున్న ప్రజా పంపిణీ వ్యవస్థపై కమీషనర్ కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, నర్సీపట్నం డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు డివిజన్ల ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, డిఎస్ఓలు శివ ప్రసాద్, నిర్మాలాభాయ్, పౌర సరఫరాల డిఎం టి. వెంకటరమణ, తూనికలు కొతలతలు శాఖ ఉప నియంత్రణాధికారి సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.