గ్రామసచివాలయ సేవలపై చైతన్యమేది..


Ens Balu
2
Tadepalle
2021-03-04 10:02:01

గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై సుమారు 16 నెలలు కావొస్తున్నా..ఇంకా ఇక్కడ అందే సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేదు.. కాదు కాదు సచివాలయ సిబ్బంది అవగాహన పెంచలేదు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్లు ఉన్నా వాంతా పించన్లు ఇచ్చిన తరువాత కార్యాలయాల్లో పిచ్చాపాటి కబుర్లే పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజలకు గ్రామసచివాలయాల్లో ఎన్ని ప్రభుత్వశాఖల సిబ్బంది ఉన్నారు, ఏ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి, ఏ సేవకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసేలా చైతన్యం తీసుకు వస్తే..  జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి 50శాతనికి పైగా అర్జీలు తగ్గుతాయి. కానీ ఆదిశగా ప్రభుత్వం ముందడుగు వేయలేదు. రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామసచివాలయాల్లో తప్పితే మరెక్కడా సచివాలయ సేవలపై కనీసం ప్లెక్సీలుగానీ, బోర్డులు గానీ ఏర్పాటు చేయలేదు. చాలా సచివాలయాల్లో నేటికీ ఏ పనికి ఎంత మొత్తం చెల్లించాలో తెలియకపోవడంతో ప్రజలు ప్రభుత్వానికి, అక్కడ పనిచేసే సిబ్బందికి ఇద్దరికీ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు పెళ్లి ద్రువీకరణ పత్రానికి సచివాలయం ద్వారా ప్రభుత్వానికి చెల్లించే మొత్తం రూ.100 ఉంటే దానికి గ్రామసచివాలయాలు, దేవస్థానాల వద్ద ఉండే సచివాలయాల్లో తక్కువలో తక్కువ 3వేల నుంచి 5వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఆస్తి సర్వేకి రూ.700 ఛలానా వుంటే 2వేల నుంచి 5వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీధిలైట్ల రిపేరుకి, కుళాయిల రిపేరికి అదే పరిస్థితి. చాలా పంచాయతీల్లో నేటికీ శానిటేషన్ సబ్బంది లేదక చెత్తను ఎత్తే నాధుడే లేడు. ఉన్న ఒక్క వ్యక్తి ఎంతో కొంత ఇస్తే తప్పా ఆ చెత్తను కూడా తీసుకెళ్లడం లేదు. అనుకున్న, అడిగిన మొత్తం ఇవ్వకపోవే ఆ పని పూర్తి కావడానికి, చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డువచ్చి చివరాఖరి రోజు గానీ చేయడం లేదు.  ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రామసచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన 14శాఖల సిబ్బంది డ్యూటీ చార్టు ప్రకారం వారంతా ప్రజల్లోనే ఉండి, ప్రభుత్వ సేవల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన పరిస్థితి. కానీ చాలా చోట్ల సిబ్బంది మొత్తమంతా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఆరోగ్య సహాయకులు మాత్రం వారికి కేటాయించిన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో సర్వేయర్లకు కూడా చేతినిండి పని దొరికింది. గ్రామ కార్యదర్శిలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. కానీ అధికారులు వచ్చినపుడు, ప్రజాప్రతినిధులు వచ్చినపుడు తప్పితే వీరు బయటకు వచ్చే పరిస్థితే కనిపించదు. మరికొందరు కార్యదర్శిలు వాలంటీర్లను సైతం వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే మీటింగుల పేరుతో ఉంచేస్తున్నారు. ఇంత జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రజలకు గ్రామసచివాలయాల ద్వారా అందించే సేవలు ఎలా తెలుస్తాయో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇక వెల్పేర్ అసిస్టెంట్లు విషయానికొస్తే వారికి 1వ తేది నుంచి 15 వతేదీ వరకూ నిరంతరం పనిలో ఉంటారు. డిటిటల్ అసిస్టెంట్ కార్యాలయాలకే పరిమితం అవుతారు. వీఆర్వోలు ఉంటే సచివాలయంలో లేదంటే తహశీల్దార్ కార్యాలయంలోనూ ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు ఎమునా తీరే అన్నట్టుగా ఉండటం, సమయం వచ్చినపుడు పనిచేసి మిగిలిన సమయాల్లో కార్యాలయాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు గ్రామసభలు ఏర్పాటు చేసిన సందర్భంలో నైనా ఏ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఎన్నిశాఖల సిబ్బంది ఉంటున్నారు, వారి ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి, దానికి ప్రభుత్వానికి ఎంత ఛలానా కట్టాల్సివుంటుంది అనే కోణంపై నేటికీ ఒక్కసారికి కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చిన పాపన పోలేదు. సిబ్బంది ప్రొబిషన్ సమయంలోనే ఇలా వుంటే మరో ఆరు నెలల్లో వీరి ఉద్యోగాలన్నీ రెగ్యులర్ అయిన తరువాత మరింతగా వారికి నచ్చినట్టు విధులు నిర్వహించే అవకాశం వుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన విధులతోపాటు, సచివాలయం ద్వారా ఏ ఏ ప్రభుత్వ సేవలు అందిస్తున్నారో తెలియజేస్తే స్పందన కార్యక్రమానికి అర్జీలు పెరుగుతాయి. లేదంటే యదా రాజా తధా ప్రజా అన్నట్టుగా స్పందన అర్జీ పట్టుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లక తప్పదు. ఈ విషయంలో ప్రభుత్వంగానీ, సచివాలయాల శాఖ జెసిలుగానీ, జిల్లా పంచాయతీ అధికారులు గానీ, మండల స్థాయిలో ఎంపీడీఓలుగాని ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..!