సచివాలయాల్లో ఇక నిత్య స్పందన..


Ens Balu
2
Tadepalle
2021-03-05 09:09:46

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇపుడు ఆ సేవలను మరింతగా పెంచాలని, గ్రామస్థాయిలో సమస్యలన్నీ సచివాలయాల్లోనే పరిష్కరించాలని యోచించి ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే సరికొత్త కార్యక్రమానికి తెరతీసింది. దీనితో ఇప్పటి వరకూ ఆడుతూపాడుతూ పనిచేసిన సచివాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి ఆయా శాఖలకు చెందిన వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించాలి. ఆతరువాత ప్రతీరోజూ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ సచివాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించాలి. ఇలా ఏ సచివాయలం నుంచి ఎన్ని సమస్యలు పరిష్కరించారో కూడా ప్రభుత్వం దగ్గర డేష్ బోర్డులో నమోదు అవుతాయి. గతంలో మాదిరిగా తాము చాలా కష్టపడి పనిచేసేశామని సచివాలయ సిబ్బంది చెప్పడానికి వీలుండదు. వారు ఎంతలా పనిచేశారు..గ్రామంలో ఎన్ని సమస్యలు పరిష్కరించారనే దానిపై కంప్యూటర్ మొత్తం లెక్కలు తేలుస్తుంది. గతంలో సచివాలయాల్లో ప్రతీ సోమవారం మాత్రమే స్పందన నిర్వహించేవారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. దీనితో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలపై కలెక్టర్ కు అర్జీ పెట్టుకుంటే అదే దరఖాస్తు సచివాలయం వరకూ వచ్చేది. ఓ పనికి రెండు పనులు అయ్యేవి. దీనిపై కాస్త గట్టిగా ద్రుష్టి పెట్టిన ప్రభుత్వం గ్రామసచివాలయ పరిధిలోనే సమస్యలు పరిష్కరించేలా నిత్య స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాల్సి వుంటుంది. ఆ విషయాన్ని గ్రామవాలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాల వారికి తెలియజేయాల్సి వుంటుంది. ఎవరికైనా సమస్యలపై దరఖాస్తు పెట్టడం రాకపోయినా వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తెలియజేయాలి. ఆవిధంగా  గ్రామంలోని సమస్యలను నేరుగా సచివాలయ సిబ్బంది పరిష్కరించాలి. వారి పరిధిలో పరిష్కారం కాని సమస్యలను మండల కేంద్రానికి పంపాలి. అలా అక్కడ కూడా పరిష్కారం కాకపోతే జిల్లా  కలెక్టర్ ద్రుష్టికి సమస్య వెళుతుంది. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. తద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి వినతులు తగ్గించి, వారిని పరిపాలన, అభివ్రుద్ధిపై ద్రుష్టి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామంలో సచివాలయాలు ఉన్నా నేటికీ జిల్లా కార్యాలయాలకు అత్యధిక స్థాయిలో స్పందన దరకాస్తులు రావడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమస్య పరిష్కారంలో చేయి తడిపే వ్యవహారాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల గ్రామసచివాలయాల జాయింట్ కలెక్టర్లకు ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. వాటి అపుడే జెసిలంతా జిల్లాలో స్పందన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో స్పందన కార్యక్రమం గ్రామసచివాలయాల్లో జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, కొన్ని సచివాలయాల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సచివాలయ సిబ్బంది ప్రతీరోజూ చేతినిండా పనిదొరకడంతోపాటు, గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారినికి మార్గం చూపించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిత్య స్పందన కార్యక్రమం ఏ స్థాయిలో విజయవంతం అవుతందనేది ఆరునెలల కాలలో తేలిపోతుంది.