మహిళా ఉద్యోగుల ప్రసూతి వేదన..


Ens Balu
2
Tadepalle
2021-03-11 11:46:06

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతూ ప్రసూతి వేదన అనుభవిస్తున్నారు..ఇదేదో కాన్పు సమయంలో, బిడ్డను కనడానికి పడే వేదన కాదు..ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో ఇచ్చే సెలవులను తిరిగి జీతంగా తెచ్చుకోవడానికి పడే ఇబ్బంది వేదన, నరకం ఇలా బాధ పెట్టడానికి ఎన్ని పదాలుంటే అన్నింటికీ ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకోవచ్చు.. మొన్నటి వరకూ ఆ ఇబ్బంది రెగ్యులర్ ఉద్యోగులకే అనుకుంటే కేవలం 15వేల రూపాయల జీతంతో పనిచేసే నేటి గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు కూడా ఇదే ఇబ్బందులను ఎదుక్కోవాల్సి వస్తుంది. అవును మీరు చదవుతున్నది అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆడపడుచు ఆవేదన. ఆరునెలల ప్రసూతి సెలవులు ప్రభుత్వం ఇచ్చినా, ఆపై ప్రసూతి రికార్డులు ప్రభుత్వానికి సంబంధిత శాఖ ద్వారా సమర్పిస్తే జీతం రావాలి. అలా ప్రభుత్వ శాఖల ద్వారా వస్తుంది కూడా. కానీ ఇక్కడే అసలైన చిక్కంతా మహిళా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆరునెలల జీతం బిల్లుగా మార్చాలంటే సంబంధిత శాఖలో పదిశాతం జీతం మామూలుగా సమర్పించాల్సి వస్తుంది. అలా సమర్పించిన వారికి మాత్రమే బిల్లులు క్షణాల్లో మంజూరవుతున్నాయి. లేదంటే వారు నెలల తరబడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతానికి వీరికెందుకు మామూళ్లు ఇవ్వాలంటే అది అనాదిగా వస్తున్న ఆచారమని చాలా ఠీవీగా చెబుతున్నారు ఆయా శాఖల్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు ఇతర అధికారులు. మాకు కూడా శాఖ పరమైన ఖర్చులుంటాయని కూడా శెలవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడే మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకెళితే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఆరు నెలలు ప్రసూతి సెలవులు పెట్టుకుంటారో అపుడే సంబంధిత జిల్లా శాఖల అధికారులు గానీ, లేదంటే సదరు జిల్లా కలెక్టర్ గానీ సెలవుతో కూడిన జీతం మంజూరు చేస్తున్నారు. ఆ విధంగా లేఖలు ఇస్తున్నారు. అలాంటి వారికి బాగానే ఉన్నా, ఆవిషయం తెలియని వారు మాత్రం ఆరు నెలల తరువాత సాలరీ బిల్లులతోపాటు, ఈ ఆరు నెలల ప్రసూతి సెలవులు బిల్లు పెట్టే సమయంలో సంబంధిత మండలశాఖ కార్యాలయంలో ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ బిల్లులు మాత్రం పాస్ కావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు..కేవలం రూ.15వేలతోనే ఉద్యోగం చేసుకునే గ్రామసచివాలయ  మహిళా ఉద్యోగుల నుంచి కూడా సంబంధిత శాఖ సిబ్బంది మామూళ్లకు పాల్పపడటం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అందులోనూ అత్యధిక సిబ్బంది ఉన్న ఈ శాఖలో మహిళా ఉద్యోగిణిలు కూడా అధికంగా వుండటం చాలా మందికి అధికారులకు, సిబ్బందికి బాగా కలిసి వస్తుంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ల వరకూ వెళ్లడంతో వారికి సెలవుతోపాటు, ప్రత్యేక లేఖ ద్వారా మానవతా ద్రుక్పదంతో జీతం కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని జిల్లాల కలెక్టర్లు. కాకపోతే ప్రభుత్వమే అధికారికంగా ఈ సర్ధుబాటు చేస్తే మధ్యలో ఈ దలారీ ప్రభుత్వశాఖల సీనియర్ అసిస్టెంట్లకు, ఇతర అధికారులకు మామూళ్లు ఇచ్చే బాధలు తప్పుతాయని ఆవేదన చెందుతున్నారు మహిళా ఉద్యోగులు.  ప్రభుత్వం ఈ విషయంలో మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులు ఇచ్చే సమయం నుంచే జీతం ఇవ్వడంతోపాటు, సంబందిత ప్రసూతి పత్రాలు కూడా తిరిగి విధుల్లోకి చేరే సమయంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తల్లీబిడ్డకోసం ప్రసూతి సెలవులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నా.. అయితే మాకేంటి అన్నట్టుగా పలుశాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్పడే మామూళ్లకు కళ్లెం పడదని... మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  అదే సమయంలో ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇచ్చిన సమయంలో తిరిగి ఆ సెలవులకు సంబంధించిన లీవ్ జీతంగా మారడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనితో మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. ఆ విషయంపై సాంకేతిక సమస్యలపై రాష్ట్రప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయంతీసుకుంటే ప్రసూతి సెలవులపైనా మామూళ్లు వెతుక్కునే సిబ్బంది లంచావతారాలకు ముకుతాడు పడే అవకాశం కలుగుతుంది. ఈ విషయం తెలియజేసిన తరువాత ప్రభుత్వం ఇది తప్పుడు వార్త అనుకోవడానికి లేదు.. అలా లంచాలు తీసుకునే వారిపై ద్రుష్టిసారిస్తే గ్రామసచివాలయ శాఖ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రసూతి సెలవులపై కమిషన్లు మేసే లంచావతారులను పట్టుకోవచ్చు..ఈ సమాచారం కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగిణిలు కంట తడి పెట్టుకుంటూ చెప్పిన వివరాలు ఆధారంగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేక కధనాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తున్నామని కూడా ప్రభుత్వానికి, పలుశాఖల అధికారులకు తెలియజేస్తున్నాం. ఇంత సమాచారం ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!