ఏపీలో మొదలైన మున్సిపల్ కౌంటింగ్..


Ens Balu
2
Tadepalle
2021-03-14 09:36:25

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నకల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల క్రమంలోనే పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం  కౌంటింగ్‌ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఈ క్రమంలోనే తొలి ఫలితాల సంఖ్య ఉదయం పదిగంటలకు వచ్చే అవకాశం వుంది.