ఆర్.టి.సి బస్సులలో ఆక్యుపెన్సీ పెంచాలి..


Ens Balu
1
Srikakulam
2021-03-19 15:12:17

ఆర్.టి.సి బస్సుల్లో  ఆక్యుపెన్సీ పెంచాలని ఆర్.టి.సి వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఆర్.పి.ఠాగూర్ అన్నారు. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఠాగూర్ శ్రీకాకుళం ఆర్.టి.సి డిపో, కాంప్లెక్సు ప్రాంతాలను తనిఖీ చేసారు. అనంతరం శ్రీకాకుళం ఒకటవ నంబరు డిపోలో ఆర్.టి.సి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసగించారు. ఆర్.టి.సి ఉద్యోగులది గురుతరమైన బాధ్యత అన్నారు. ఆక్యుపెన్సీ రేట్ పెంచాలని, మైలేజ్ పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి రోజు 8 లక్షల లీటర్ల డీజిల్ ను ఆర్.టి.సి వినియోగిస్తుందని ఆయన అన్నారు. మైలేజిని పెంచడం ద్వారా వినియోగం తగ్గించాలని తద్వారా ఆదాయం పెరిగే దిశగా అడుగులు వేయగలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టుటకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రజల అవసరం మేరకు సేవలు మెరుగుపరచుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల పనితీరు (పెర్ఫార్మెన్సు) మెరుగుపడాలని, ప్రజా రవాణా శాఖ స్వయం ప్రతిపత్తి దిశగా సాగలని తద్వారా  ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పాత బకాయిలను చెల్లిస్తామని, పారితోషికాలను పునరుద్ధరిస్తామని ఎం.డి తెలిపారు. శ్రీకాకుళంలో డిపోలు, కాంప్లెక్సు విశాలంగా ఉన్నాయని చక్కని వాతావరణం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్ గా ప్రధమ స్ధానం సాధించిన ఎస్.వి.రమణకు రూ.5 వందల పారితోషికాన్ని అందించారు. ఇతర డిపోలలో పనిచేస్తు ఉత్తమ ఫలితాలు అందించిన వారికి పారితోషికాలను సంబంధిత డిపో మేనేజర్లకు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.రవి కుమార్, రీజనల్ మేనేజర్ ఏ.అప్పల రాజు, డివిజనల్ మేనేజర్ జి.వరలక్ష్మి, డిపోమేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.