ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు అమలు చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా మార్చిన విధానం ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే అందరు ఉద్యోగులు ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సు(ఇన్, ఔట్) వేస్తే తప్పా వారికి జీతాలు పెట్టేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ వేస్తున్నారు. ఈ సమయంలో గర్భిణి/బాలింత మహిళా ఉద్యోగులు భయం భయంగా బయో మెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఇదే క్రమంలో చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన కూడా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే 15వేల జీతంలోనే ప్రత్యేకంగా శానిటైజర్లు, గ్లౌజ్ లు, మాస్కులు, ఫేస్ షీల్డులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఏ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియని తరుణంలో అందరు ఉద్యోగులు ఒకే బయో మెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం పట్ల ఎవరికైనా వైరస్ సోకితే సచివాలయంలోని అందరు ఉద్యోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని హడలి చస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతీరోజూ అందరూ బయో మెట్రిక్ వేస్తున్నప్పటికీ ఏ సచివాలయంలోనూ ప్రభుత్వం గానీ, జిల్లా అధికారులు గానీ కనీసం శానిటైజర్లును ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు హేండ్ గ్లౌజులు, ప్రజలు తీసుకొచ్చే కాగితాలు వేయడానికి ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలు ఏర్పాటు చేస్తున్నారని..కానీ గ్రామ సచివాలయాల్లో ఎక్కడా వీటిని ఏర్పాటు చేయక పోవడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తుంది. అందులోనూ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంతా కలిసి ఒకే బయో మెట్రిక్ మిషన్ ను వినియోగించడమే ఇక్కడ భయాందోళనకు గురిచేస్తుంది. వాలంటీర్లకి ఇచ్చిన 50 ఇళ్లకి వెళూతూ, సచివాలయానికి వచ్చేటపుడు వీరంతా బయో మెట్రిక్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు బయట తిరిగే సమయంలో వీరి ద్వారా అయినా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. వాలంటీర్లు కూడా తప్పని సరిగా బయో మెట్రిక్ వేస్తే తప్పా వారికిచ్చే గౌరవ వేతనాలు రావని చెబుతుండటంతో వారు కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో చాలా ప్రభుత్వ శాఖల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తీసేసినప్పటకీ గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రం అమలు చేయడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కరోనా వైరస్ పూర్తిగా సమసి పోయేంతవరకూ అయినా అందరూ ఒకే చోట బయోమెట్రిక అటెండెన్సు వేసే విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అందరూ కింది స్థాయి సిబ్బందే కావడంతో ఎవరూ ఈ ఇబ్బందులను ఇటు జిల్లా కలెక్టర్, జెసి గ్రామ సచివాలయాలు ద్రుష్టికి తీసుకు వెళ్ల లేకపోతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా సమయంలో సామూహికంగా ఒకే చోట బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి ఈ కరోనా సమయంలో మినహాయింపు వచ్చేటట్టు కనిపించడం లేదు.