కోవిడ్ కేర్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు..


Ens Balu
4
అమలాపురం
2021-05-06 14:16:47

 కోవిడ్ కేర్ సెంటర్ లో చేరే కరోనా బాధితులకు మెరుగైన వైద్య, ఆహార సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సిసిసి వైద్యులను ఆదేశించారు. గురువారం అల్లవరం మండలం బోడశకుర్రు కోవిడ్ కేర్ సెంటర్ ను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను, భోజన, మౌలిక సదుపాయాల నిర్వహణ గురించి వైద్యులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ లో చేరే రోగులను ట్రాయజింగ్ చేసి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్య సేవలు అందించాలని అన్నారు. సిసిసి లో చేరే రోగులకు గదులను క్రమ పద్ధతిలో కేటాయించి, అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ సమర్థవంతంగా పనిచేయాలని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రాంగణంలో వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా రోగులు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోగుల కొరకు వచ్చే వారిని లోపలికి రానివ్వకుండా చూడాలని, అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పేషంట్ల యొక్క వాహనాల పార్కింగ్ ను నిర్వహించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటకం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అవసరమైన వైద్య సహాయాన్ని త్వరితగతిన అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిసిసి లో చేరిన పాజిటివ్ రోగులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆహార సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితిని గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా మీ ఇంట్లో ఇంకెవరికైనా ఈ వ్యాధి సోకిందా, వారు ఇంట్లోనే వుంటున్నారా అని కలెక్టర్ రోగులను ఆరా తీశారు. ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉందని, త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని, అవసరమైన మేరకు మాత్రమే బయటకు రావాలని, తప్పనిసరిగా మాస్కును ధరించి, శుభ్రత, భౌతిక దూరం పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పమని కలెక్టర్ కోరారు. సిసిసిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార సదుపాయాల పట్ల సంతృప్తి కరంగా వున్నట్లు ఈ సందర్భంగా రోగులు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా  పేషంట్ ను అడ్మిట్ చేసుకునే విభాగాన్ని, ఇప్పటి వరకు చేరిన బాధితుల వివరాలు, హెల్ప్ డెస్క్, ట్రయేజ్ సెంటర్ ను, ఆక్సిజన్ సదుపాయాన్ని, మందుల నిల్వలు, పార్కింగ్, శానిటేషన్, విద్యుత్ నిర్వహణ, పార్కింగ్, తదితర అంశాలను సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.
                   ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, అల్లవరం తహశీల్దార్ ఎస్. అప్పారావు, మున్సిపల్ డిఇఇ అప్పలరాజు, వైద్యులు నితీష్ కుమార్, ఇంద్రావతి, తదితరులు పాల్గొన్నారు.