గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు అధికార బదలాయింపు లేనట్టేనా..


Ens Balu
10
తాడేపల్లి
2021-05-07 01:47:54

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికార బదలాయింపులకు పురిటి కష్టాలు వీడలేదు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే అన్ని అధికారాలు, నిధులు, రికార్డులు ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసి అందులో గ్రేడ్-5 కార్యదర్శిలను ఏర్పాటు చేసినా వారంతా ఉత్సవ విగ్రహాల్లా కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన పనులు చేస్తూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన తరువాత కూడా సచివాలయాల వారీగా ప్రాంతాలు, రికార్డులు, నిధులు, పారిశుధ్య సిబ్బంది, వాహనాల విభజన నేటికీ అధికారులు చేపట్టలేదు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా గ్రేడ్-5 ఎంపీడీఓలు, డీపీఓలు, ఆఖరికి పంచాయతీరాజ్ కమిషనర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేయడానికి జీఓని ఆఘమేఘాలపై తీసుకొచ్చిన ప్రభుత్వం..నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉండిపోయిన అధికార బదలాయింపు విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదు. దీనితో పేరుకే వీరు గ్రామ కార్యదర్శిలుగా ఉన్నారు తప్పితే వీరికి ఎలాంటి అధికారాలు లేవు. చాలా చోట్ల ప్రధాన పంచాయతీ కార్యాలయంలోనే నేటికీ సిబ్బంది మొత్తం బయోమెట్రిక్ వేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరికి కాలువలు తీయాలన్నా, బ్లీచింగ్ చల్లాలన్నా, మంచినీటి పైపులు బాగుచేయించాలన్నా, శానిటేషన్ సిబ్బందితో పారిశుధ్య పనులు నిర్వహించాలన్నా కూడా గ్రేడ్-1 కార్యదర్శి చుట్టూ గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. తాజాగా వీఆర్వోలను పంచాయతీలకు డిడిఓలుగా చేస్తూ ఎపుడైతే ప్రభుత్వం జీఓనెంబరు 2 జారీచేసిందో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలంతా మరోసారి తమ హక్కులు, విధులు, అధికార బదలాయింపులపై మళ్లీ సమరం మొదలు పెట్టారు. ఎంపీడీఓలకు, డిపీఓలకు అర్జీలు చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ కూడా చేపట్టాలి. కానీ అలా చేయకుండా వదిలేయడంతో నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉంచేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటు ఎంపీడీఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆఖరికి జిల్లా కలెక్టర్లు కూడా వీరికి న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల్లో ప్రభుత్వ విధానంపై తీవ్ర అసహనం రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. ఆది నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, గ్రామసచివాలయాల్లోని తాజా పరిణాలమాలపై ప్రత్యేక కధనాలు ప్రచురిస్తూ వస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా అటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతోంది. ఈ విషయంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు స్పందించే తరుణంలో కరోనా మహమ్మారి రావడంతో మళ్లీ సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు చేసే పనిలో పడ్డారు. అయినప్పటికీ కొత్తగా సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం నిర్ధిష్ట అధికారాలు, విధులు, అధికార విభజన లేని ఉద్యోగాలు చేస్తున్నామనే నిరాశతో ఉన్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ద్వివేది, ఈశాఖ కమిషనర్ గిరిజా శంకర్ లు చొరవ తీసుకుంటే తప్పా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కనిపించడం లేదు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!