ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ పన్నులు చెల్లించేందుకు ఆన్ లైన్, యూపిఐ పేమెంట్లు విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కొందరు కార్యదర్శిలు వసూలైన మొత్తాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, కొన్ని చోట్ల ఇదే విషయమై సస్పెండ్లు కావడం, బదిలీల సమయంలో రికార్డులు పూర్తిస్థాయిలో కొత్తగా వచ్చేవారికి అప్పగించకపోవడం వంటి కారణాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. మూడు నెలల వ్యవస్ధిలో సుమారు పదిమందికి పైగా పంచాయతీ కార్యదర్శిలు అవినీతి వ్యవహారాల్లో స్పెండ్ అవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. చాలా చోట్ల ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా ఉన్న చోట ఇప్పటికే అవినీతికి పాల్పడినందుకు సదరు మొత్తాలను వారే బాధ్యత వహించాలని నోటీసులు కూడా జారీచేశారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కెఆర్ పురం ఎంపీడీఓకి సుమారు రూ.3లక్షల విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా కరనో సమయంలో ప్రజలు ఏ పనులు కావాలన్నా, పన్నులు కట్టాలన్నా సచివాలయాలకు వస్తున్నారు. దీనితో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయాలను పరిశీలించిన ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలోనూ, విద్యుత్ శాఖ ఏపీఈపీడీసిఎల్ లోనూ అమలు చేసిన ఆన్ లైన్ బిల్ పేమెంట్లు, ఆన్ లైన్ టేక్స్ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోకూడా అమలు చేయడం ద్వారా సిబ్బందికి కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా కట్టిన మొత్తం నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా యోచన చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని లావాదేవీలకు ఆన్ లైన్ పేమెంట్లకు అనుసంధానించడంతో, గ్రామ, వార్డు సచివాలయాల్లో పొందే సేవలకు కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు సచివాలయ వెబ్ సైట్, యూపీఐ ఐడిలకు సంబంధించి సాఫ్ట్ వేర్ రూపకల్పన జరుగుతున్నట్టుగా సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. నిజంగా యూపీఐ, ఆన్ లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తే చాలా మందికి ఇంటిపన్నులు, కుళాయి పన్నులు సచివాలయాలు, పంచాయతీల చుట్టూ తిరిగి కట్టే పనుండదు. అంతేకాకుండా ఈ సందర్భంతో కొందరు పంచాయతీ సిబ్బంది పాల్పడే చేతివాటాలకు కూడా అడ్డుకట్ట పడటానికి కూడా ఆస్కారం వుంటుంది. కరోనా నియంత్రణ చర్యల్లో కాస్త బిజీగా వున్న ప్రభుత్వం మరో మూడు నాలుగు నెలల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తుందని చెబుతున్నారు. అన్ని పనులూ ఆన్ లైన్ ద్వారా టెక్నాలజీతో జరిపించే ప్రభుత్వం గ్రామసచివాలయం విషయంలో అదే టెక్నాలజీని వినియోగించుకోనుంది..