ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కరోనా కారణంగా మహిళా గర్భిణీలకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తూ డిజిపి గౌతం సవాంగ్ అన్ని జిల్లా యూనిట్లకు ఆదేశాలు జారీచేశారు.. కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఈ అవకాశం కల్పించి బాలింత మహిళా ఉద్యోగిణిలకు అవకాశాలు కల్పించకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. దానికి తోడు ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న గ్రామమహిళా సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీస్)ల విషయంలో ఈ వర్క్ ఫ్రం హోం విషయంలో క్లారిటీ రాలేదు. డీజీపి గౌతం సవాంగ్ ఇచ్చిన ఆదేశాలు వీరికి వర్తిస్తాయో లేదా అనే అంశాన్ని ఎక్కడా పేర్కొనలేదు. చాలా మంది మహిళలు అటు పోలీసు శాఖలోనూ, ఇటు సచివాలయాల్లో గర్భిణీలుగానూ.. అంతకంటే ఎక్కువగా బాలింతలుగా ఉన్నారు. కాన్పులు జరిగిన తరువాత నెలల చంటిపిల్లతోనే కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీనితో కరోనా సమయంలో తమకు కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, లేదంటే తాము కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన అవకాశం బాలింతలకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నెలలు నిండిన పిల్లలతో భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు కూడా గర్భిణీలు, బాలింతలు కూడా త్వరగా కరోనా వైరస్ భారిన పడే అకాశాలున్నాయి. ఈ విషయంలో డిజిపీ గౌతం సవాంగ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతున్నా..కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అవకాశం కల్పించి బాలింత విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. అందులోనూ సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నప్పటికీ,వీరి మాత్రుశాఖ హోం డిపార్ట్ మెంట్ కావడంతో వీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాస్తవానికి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు శాఖ ఉద్యోగులుగానే వీరంతా ఉన్నారు. అలాంటి సమయంలో వీరికి కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాల్సి వుంది. కానీ కేవలం మహిళా ఖాకీలకే అవకాశం కల్పించడం గందర గోళానికి దారితీస్తుంది. ఇదే సమయంలో సమయంలో ప్రభుత్వం నుంచే వచ్చే ఉత్తర్వులు జిల్లా ఎస్పీ కార్యాలయాలన నుంచి ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు రావాల్సి వున్నా..రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు జరగడం లేదు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలు తీర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పనిచేసే వెసులుబాటు కల్పించినా అది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తించలేదు. ఇపుడు పోలీసుశాఖలో మహిళా గర్భిణిలకు కల్పించిన వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కూడా సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కల్పించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల ఆసుపత్రుల్లో నిర్వహించే వేక్సినేషన్ల వద్దే విధులు కేటాయిస్తున్నారని కూడా భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి వుంది..