రాష్ట్రంలో చేపట్టిన మొదటి జ్వరపీడుతుల గుర్తింపు సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే కొద్ది రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 91,253 కరోనా టెస్టులు చేయగా, 21,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 99 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,752 ఐసీయూ బెడ్లు ఉండగా, 6,008 రోగులతో నిండి ఉన్నాయన్నారు. 744 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,326 ఉండగా, 22,661 బెడ్లు కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. ఇంకా 565 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సాధారణ బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 17,018 బెడ్లు ఉండగా, 10,424 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. 6,594 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 17,231 చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 20,353 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 24,544 సప్లయ్ చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గడిచిన 24 గంటల్లో 620 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేసుకున్నామన్నారు. జామ్ నగర్ స్టీల్ ప్లాంట్ నుంచి మంగళవారం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కెపాసిటీ కలిగిన 4 కంటైనర్లు రైలు మార్గంలో బయలుదేరాయన్నారు. బుధవారం రాత్రికి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రాష్ట్రానికి చేరుకుంటుందన్నారు. రూర్కెల్లా నుంచి రెండు కంటైనర్లలో 40, 80 మెట్రిక్ టన్నులు...మొత్తం 120 మెట్రిక్ ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ నిల్వలు గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతోందన్నారు.
అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్...
104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 12,629 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో 5,286 కాల్స్ వివిధ సమాచారాల నిమిత్తం వచ్చాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అడ్మిషన్లకు 2,747 కాల్స్, 1,617 కాల్స్ టెస్టు రిజల్ట్ కోసం వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 16 వేల మంది జర్వ పీడితులకు, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు వైద్యులు ఫోన్ చేసి, సలహాలు సూచనలు అందజేశారన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, కొరత ఉందంటూ ఎక్కడ నుంచి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచనలు అనుసరించి, ఫ్లాస్మా థెరపీ నిర్వహించడం లేదన్నారు.
జ్వర పీడితుల గుర్తింపు సర్వే కొనసాగింపు...
జర్వపీడుతుల మొదటి విడత సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే చేపట్టాలని, ఇలా కొన్ని రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జ్వరపీడుతులను 90 వేల మంది గుర్తించామన్నారు. 50 వేల మంది జర్వపీడితుల రక్త శాంపిళ్లను సేకరించామని, ఇప్పటికే కొందరికి కరోనా టెస్టు రిజల్ట్ రిపోర్టులు అందజేశామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులతో పాటు జర్వపీడుతులకూ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్నారు. అమరావతి, సెల్ఐటి న్యూస్... ఏపీలో ఉన్నంత మంది ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఏ రాష్ట్రంలోనూ లేరన్నారు. వలంటీర్లు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలోనే జ్వరపీడుతులను గుర్తించగలిగామన్నారు. జ్వర పీడుతుల సర్వేతో కరోనా బాధితులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు.
తప్పుడు వార్తలు నమ్మొద్దు...
సోషల్ మీడియాలో కేసులు, మృతుల గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేలా జీవో ఇచ్చామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు దాచాల్సిన పరిస్థితి లేదన్నారు. కర్ఫ్యూలో మార్పులు, లాక్ డౌన్ విధిస్తున్నారంటూ తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మరణాలపైనా ప్రతి రోజూ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఆక్సిజన్ సప్లయ్, రుయా ఆసుపత్రి ఘనటపైనా స్పష్టమైన అంకెలను తెలిపామన్నారు.