చెక్ పవర్ కోసం లెక్కలు కడుతున్నారు..


Ens Balu
5
Tadepalle
2021-05-20 01:55:17

ఆంధ్రప్రదేశ్ లోని 13367 గ్రామ పంచాయల్లో సర్పంచ్ లకు త్వరలోనే చెక్ పవర్ ఇచ్చేందుకు ప్రభుత్వం చక చకా ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం సర్పంచ్ లవివరాలను ఆన్ లైన్ చేసి బయో మెట్రిక్ తో సిఎఫ్ఎంఎస్ ఐడీలను అన్ని పంచాయతీల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రత్యేక అధికారులు, కార్యదర్శిల పాలనతో నడిచిన పంచాయతీలు చాలా సంవత్సరాల తరువాత మళ్లీ పంచాయతీ పగ్గాలు సర్పంచ్ ల చేతికి వెళ్లాయి. మళ్లీ పంచాయతీ కార్యదర్శిలు డమ్మీలుగా మారబోతున్నారు. అన్ని పనులు, ఖర్చులు కూడా సర్పంచ్ లే చేపడతారు. కార్యదర్శిలు పని కార్యాలయానికే పరిమితం అవుతుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో చేసిన ఖర్చులకు లెక్కలను,  మిగులు మొత్తానికి  వివరాలను పక్కాగా చూపిస్తే తప్పా తాము రికార్డులు స్వాధీనం చేసుకోమని సర్పంచ్ లు తెగేసి చెబుతుండటంతో కార్యదర్శిలు చేసిన ఖర్చులకు పనిగట్టుకొని లెక్కలు కడుతున్నారు. కొన్ని చోట్ల కొత్తగా విధుల్లో చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి చేసిన ఖర్చులకు మాత్రమే రికార్డులు చూపిస్తున్నారు. గతంలో పనిచేసిన వారి రికార్డులు తప్పులు తడకలుగా ఉండటంతో కొత్తగా వారు వచ్చిన తరువాత వచ్చిన నిధులకే లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడేసుకున్న పంచాయతీ కార్యదర్శిలు వాటిని కొన్ని జిల్లాల్లో తిరిగి చెల్లిస్తే.. మరికొన్నిచోట్ల చేసిన ఖర్చులకు, బిల్లులకు పొంతన లేకపోవడంతో కార్యదర్శిలతోపాటు ఎంపీడీఓలు కూడా సస్పెండ్ అయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఇలాంటి విషయాల్లోనే ఆధారాలతో సహా దొరికి సస్పెన్షన్లకు గురుయ్యారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ కొందరు అవినీతి ఎంపీడీఓలు సదరు తేడా పంచాయతీ కార్యదర్శిలకు వత్తాసు పలుకుతూ వచ్చినా.. ప్రభుత్వం సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చే విషయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతో ఆదాయ, వ్యయాలపై జోరుగా లెక్కలు కడుతున్నారు. కొన్నిచోట్ల లెక్కలు తేడాగా ఉండటంతో పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు రికార్డులు స్వాధీనం చేసుకోకుండా లెక్కలు లేని మొత్తాల వివరాలను లెక్కలు గట్టి జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓలకు నివేదించారు. ఈ తరుణంలోనే కొత్తగా వచ్చిన సర్పంచ్ లు చాలా చోట్ల పంచాయతీల్లో చేసిన ఖర్చులకు బిల్లులు చూపించని వైనంపై తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వాటిపై డిఎల్పీఓ విచారణలు చేపట్టి రికవరీ చేయడంతోపాటు సదరు పంచాయతీ కార్యదర్శిలను సస్పెండ్ చేయడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇలా పంచాయతీ నిధులు సొంత అవసరాలకు వాడుకోవడం, తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు పంపిచడం, అధిక మొత్తాలను పక్కదారి పట్టించిన వారిలో అధికంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలే ఉండటం విశేషం. కొంత మంది ఇప్పటికే విధులు నుంచి రిటైర్ అయిపోయినా వారి వివరాలను కూడా జిల్లాల వారీగా తయారు చేస్తున్నట్టు సమాచారం. పంచాయతీ రికార్డులు, పన్నుల మొత్తం, ఇతర నిధులకు లెక్కలు, వాటికి బిల్లు సక్రమంగా ఉంటే తప్పా చాలా చోట్ల సర్పంచ్ లు రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లకు ఇచ్చే చెక్ పవర్ అంశం చర్చనీయాంశమవుతుంది. అదేసమయంలో అవినీతికి పాల్పిడిన వారిని ఏరిపారేయాలని కూడా ప్రభుత్వం కంకణం కట్టుకునే ఈ చెక్ పవర్ తంతును అత్యంత వేగంగా చేపడుతుండటం విశేషం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..ఎంత మంది చేసిన ఖర్చులకు లెక్కలు చూపని పంచాయతీ కార్యదర్శిలు బయటకొస్తారనేది..!