ఆనందయ్య మందుకు ఏపీలో లైన్ క్లియర్..


Ens Balu
2
Tadepalle
2021-05-23 03:07:01

కరోనాను నియంత్రించే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆయుష్ అధికారుల నుంచి లైన్ క్లియర్ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి వుంది. ఆయుష్ వైద్యుల సమక్షంలోనే ఆనందయ్య కరోనాకి మందు తయారు చేశారు. దీనితో ఈ మందు వలన ఎలాంటి చెడు ఫలితాలు లేవని అయుష్ శాఖ కమిషనర్ రాములు తేల్చారు. అయితే దీనిని పూర్తిగా ఆయుర్వేదమని చెప్పలేమని, పసరు మందు లేదా నాటు మందుగానే గుర్తిస్తామని మాత్రం మెలిక పెట్టారు. ఈ మందు వలన కరోనా రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్టుగా ప్రాధమిక సమాచారం గుర్తించినట్టు వెల్లడించిన ఆయన  ఈ వైద్యం పొందిన మరికొందరిని పరీక్షించాలని చెబుతున్నారు. దీనితో ఏపీలో ఈ మందుపై ఏపీలో అధ్యయనం ముగిసింది. ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థCCRAS(సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్)కు ఏపీలోని ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుందని ఆయుష్ కమిషనర్  ప్రకటించారు. కానీ ఈ మందుని ఆయుర్వేద మందు అనడానికి ముందుకి రాని ప్రభుత్వ అధికారులు కూడా నాటు మందుగానే గుర్తించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఆనందయ్య కరోనా వైరస్ నియంత్రణకు తయారు చేసిన ఈ మందులో అన్నీ ఆయుర్వేద దినుసులే వినియోగించి చేసినప్పటీకీ ప్రభుత్వ అధికారులు కూడా నాటు వైద్యమనే ముద్రవేశారు తప్పితే ఈ మందు పనిచేయడం లేదని, గానీ దీనికి శాస్త్రీయత లేదని ఎక్కడా తేల్చలేదు. దీనితో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అధికారులు ఈ మందులపై ఎలాంటి నివేదికలు ఇస్తాయనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. అన్నీ అనుకూలిస్తే ప్రభుత్వం ద్వారానే ఈ మందుని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఒక అధికారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగ వివరించారు.