గ్రామ, వార్డు సచివాలయాలు కీలకం కావాలి..


Ens Balu
5
Tadepalle
2021-06-02 13:47:20

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడంలో కీలకం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అధిపతులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాలతో సహా అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచడంతోపాటు, ఒక డిజిటిల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తం  70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని వెల్లడించిన సీఎం 2023నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలన్నారు. అంతేకాకుండా పట్టణాల్లో యూఎల్బీ సర్వేని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్‌ (సర్వే సెటిల్‌మెంట్స్‌) సిద్దార్ధ జైన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబు,  ముఖ్యమంత్రి ప్రధానసలహాదారు అజేయ కల్లంతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.