నెలాఖరుకి 58,72,370 టీకాలు..


Ens Balu
2
Tadepalle
2021-06-03 16:20:10

జూన్ నెలాఖరు నాటికి 58,72,370 టీకాలు రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి 87,08,730 డోసులు వచ్చాయన్నారు. జూన్ 2 వ తేదీ రాత్రికి కేంద్రమిచ్చిన డోసుల్లో 5,67,970, ఏపీ ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన దాంట్లో 44.170 డోసులు అందుబాటులో ఉన్నాయని, మొత్తంగా  6,12,170 డోసుల స్టాక్ ఉందని తెలిపారు. ఇప్పటికి వరకూ 1,01,94,389 డోసులను పంపిణీ చేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి 36,94,210 డోసులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా 20,74,730 డోసులను కొనుగోలు చేయనున్నామని, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మొత్తంగా చూస్తే జూన్ 30 వరకూ 58,72,370 డోసులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇప్పటికే జరుగుతున్న వ్యాక్సినేషన్ తో కలిపి జూన్ నెలాఖరు వరకూ 1.60 కోట్ల టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. కేంద్రమిచ్చే వ్యాక్సిన్ కోటా చాలకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. మే 13 తేదీన వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం  నోటిఫై చేశామని, జూన్ 3 సాయంత్రంలోగా బిడ్ ఫైల్ చేయాలని కోరుతూ గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. మే 20తేదీన నిర్వహించిన ప్రీబిడ్ లో మూడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. గడువు ముగిసినా ఎవరూ బిడ్ దాఖలు చేయలేదన్నారు. బిడ్ దాఖలకు మరో రెండు వారాలు గడువు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. యూపీ, కర్నాటక, రాజస్తాన్, ఒడిశా.. ఇలా దేశ వ్యాప్తంగా 9 ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా, బిడ్ దాఖలకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.