రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..


Ens Balu
3
Tadepalle
2021-06-03 16:22:23

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, తగ్గడం లేదంటూ కొందరు అవస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అవాస్తవాల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదముందన్నారు. వారం రోజుల నుంచి చూస్తే అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పు గోదావరిలో 3,400ల నుంచి 2,050 కేసులకు తగ్గాయన్నారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివీ రేటు మే 5నాటికి 17 శాతం ఉండగా, జూన్ 2వ తేదీ నాటికి 13 శాతానికి తగ్గిందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న మే 17న 2,11,554 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో జూన్ 2వ తేదీ నాటికి 1,43,795 కేసులకు తగ్గాయని, గురువారం(జూన్ 3వతేదీ) నాటికి మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో 99.2 వరకూ పెరగనుందన్నారు. మే 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 380 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, జూన్ 2వ తేదీకి 1582 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మే 17 నాటికి 433 ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే ఖాళీగా ఉంటే జూన్ 2వ తేదీ నాటికి 7,270 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయడానికి ఈ అంకెలు నిదర్శనమన్నారు.