61.13% మందికి ఆరోగ్య శ్రీ సేవలు..


Ens Balu
3
Tadepalle
2021-06-03 16:33:15

రాష్ట్రంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక శాతం మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 86,223 శాంపిళ్లు పరీక్షించగా, 11,421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయిని, 81 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,674 ఐసీయూ బెడ్లు, 7,527 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,658 మంది చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆక్సిజన్ వినియోగం రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. ఆక్సిజన్ అవసరం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 16వ తేదీన 104 కాల్ సెంటర్ అభివృద్ధి పరిచిన నాటి నుంచి చూసుకుంటే గడిచిన 24 గంటల్లో  కాల్ సెంటర్ కు గతంలో కంటే తక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 3,427 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం 468 కాల్స్ వచ్చాయన్నారు.  హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 23,285 మందితో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో మాట్లాడి సలహాలు సూచనలు అందజేశారన్నారు.