ఇక్కడా రోగనిర్ధారణ పరీక్షలు జరగవు..
Ens Balu
4
Tadepalle
2021-06-06 04:14:14
డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ పేరు వినగానే దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి వైద్యం చేసినంత అనుభూతి కలుతుంది.. కానీ ఏం సుఖం లక్షల ఖర్చుచేసి భవనం నిర్మించి, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలతో సుమారు 100 రకాల మందులు ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం నిర్ధేశించిన 12 వైద్యసేవల్లో ప్రధానంగా ఉండాల్సిన రోగ నిర్ధారణ పరీక్షలు(షుగరు,రక్తం, మూత్రం, మలం, జ్వరం) ఊసెత్తలేదు ప్రభుత్వం. రోగ నిర్ధారణ కాకుండా ఏ జబ్బుకి ఏ మందులిస్తారో కూడా తెలియని పరిస్థితి. తద్వారా గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసినా రోగ నిర్ధారణ పరీక్షకోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించక తప్పటట్టులేదు. అలా కాకుండా పీహెచ్సీల్లో అయినా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుందామంటే ఆసుపత్రుల్లో మెడికల్ ల్యాబ్ లు సక్రమంగా లేవు. ల్యాబ్ లున్న ఉన్నచోట ల్యాబ్ టెక్నీషియన్ లేడు, టెక్నీషియన్ ఉన్నచోట ల్యాబ్ లు, పరికరాలు, మెడికల్ కిట్లు లేవు.. కనీసం విలేజ్ హెల్త్ క్లినిక్ లలో అయినా ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించడానికి రోగ నిర్ధారణ గ్రామాల్లో చేస్తుందని ఆశపడ్డ రోగులకు నిరాసే ఎదురైంది. ఏ రోజైతే గ్రామస్థాయిలో ప్రాధమిక వైద్యం రోగనిర్ధారణతో అందుబాటులోకి వస్తుందో ఆరోజే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అనేవారు వైఎస్సార్ ఎప్పుడూ..ఆ మాటలను నిజం చేస్తూ ఏర్పాటవుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఏర్పాటు చేస్తే.. మెడికల్ టెస్టుల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే భారం తప్పేది. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10032 విలేజ్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోకి తెస్తుంది. వీటికోసం గత ఏడాది 2920 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్తగా మరో ఏడువేల పోస్టులను భర్తీ చేసి వారి ద్వారా ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా దానిని అమలు చేసే విధానంలోనే ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి.. రోగి వ్యాధిని పరీక్ష చేసి నిర్ధారణ అయిన తరువాత మందులిస్తే రోగం నయం అవుతుంది..అంతే తప్పా రోగం లక్షణాలు తెలుసుకొని మందులిస్తే... చీకటిలో బాణం వేసినట్టుగా ఒక్కోసారి మాత్రమే పనిచేస్తాయి. తరువాత మళ్లీ మళ్లీ మందులివ్వాలి.. ఇక్కడ ప్రభుత్వానికి సూచనలు చేసిన అధికారులు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యమంటేనే రోగ నిర్ధారణ.. కేవలం ఆ ఒక్క విషయంతోనే ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయలు రోగులకు వైద్యపరీక్షల పేరుతో బిల్లులు వేస్తాయి. అలాంటిది ప్రభుత్వం నిర్మించే ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు(మెడికల్ టెస్టులు, మెడికల్ ల్యాబ్ లు) చేసే అవకాశం కల్పించకపోతే... రోగ నిర్ధారణ ఎలా జరుగుతుందనే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఒక్క ఉన్నతాధికారి కూడా ప్రభుత్వానికి సూచింకపోవడం దురద్రుష్టకరం. అలాగని పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులను, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించినట్టుగా ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వం నియమించిందా అంటే అదీ లేదు. ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ తో అరకొరగా సేవలు అందిస్తుంది. కనీసం ఒక్కో పీహెచ్సీ పరిధిలోనైనా రెండో ల్యాబ్ టెక్నీషయన్ ను పూర్తిస్థాయిలో మెడికల్ కిట్ల తో ఏర్పాటు చేసినా, విలేజ్ క్లినిక్ ల నుంచి రక్త పరీక్షల కోసం పీహెచ్సీలకు రోగులకు రోగనిర్దారణ కోసం పంపడానికి వీలుపడేది. అలాకాకుండా ఇప్పటికే ఒక్కో గ్రామ సచివాలయానికి ఒక ఆరోగ్య సహాయకులను ప్రభుత్వం నియమించినా మళ్లీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో మరో పోస్టును క్రియేట్ చేసి మరీ ఇక్కడ భర్తీచేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్టు అవసరమనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో గ్రామసచివాలయ పరిధిలో ఒక్కో ఏఎన్ఎం నియమించబడ్డారు. ఇపుడు అదనంగా నియమించే వారి స్థానంలో ల్యాబ్ టెక్నీషియన్లను నియమిస్తే ప్రజలకు తొలుత రోగ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటికే గ్రామంలో విధి నిర్వహణలో వున్న సచివాలయ ఏఎన్ఎంను హెల్త్ క్లినిక్ అనుసంధానిస్తే ప్రాధమిక వైద్యం వారి ద్వారానే అందుతుంది. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లును నియమించడం ద్వారా వయస్సు మళ్లిన వారికి సుగరు పరీక్షలు, గర్భిణీ స్త్రీలు, పాఠశాల విద్యార్ధులకు రక్త పరీక్షలు చేయడానికి ఆస్కారం వుంటుంది. రోగ నిర్ధారణ చేసిన తరువాత సదరురోగానికి సరైన మందు ఇవ్వడం ద్వారా రోగాలను అనుకున్న స్థాయిలో నియంత్రించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా రోగ నిర్ధారణ కోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించే భారం కూడా ప్రజలకు తప్పుతుంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినక్ లలో ల్యాబ్ టెక్నీషియన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించాలనుకున్న ప్రాధమిక వైద్యసేవలు పూర్తిగా అందించడానికి వీలుపడుతుంది. లేదంటే మేడిపండు చందంగానే తయారవుతాయి డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా ఇదేదో కావాలని అంటున్నమాట కాదు 12 రకాల వైద్యసేవల్లో రోగ నిర్ధారణ పరీక్షలను చేర్చకపోవడంపై ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఈ ప్రత్యేక కధనానికి పునాది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం..వైద్యో నారాయణో హరి..!