కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల సూచనలతో ముందు జాగ్రత్తతో రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండొచ్చునని, వారికి కూడా 45 ఏళ్లు పైబడిన వారితో కలిసి టీకాలు వేయనున్నామని, దీనికి సంబంధించిన విధివిధానాలను అన్నిజిల్లా కలెక్టర్లకు జారీచేయనున్నామని చెప్పారు. కరోనా చికిత్సల నిమిత్తం రాష్ట్రంలో 600లకు పైగా ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులిచ్చామన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని వాటిలో పిడియాట్రిక్ కేసుల చికిత్స, వాటిలో పిడి యాట్రిక్ వార్డులు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చిన్న పిలల్లకు కరోనా పాజిటివ్ వస్తే, చికిత్స సమయంలో వారితో పాటు ఆసుపత్రుల్లో తల్లులు కూడా ఉండాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సింఘాల్ వివరించారు..