రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు.