థర్డ్ వేవ్ నివారణకు ప్రత్యేక చర్యలు.


Ens Balu
3
Tadepalle
2021-06-07 17:18:39

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చనే నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో సూచించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్  కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో  2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే,  ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారన్నారు.