తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ,ఎస్టీ ,బీ సి వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామాలయాల నిర్మాణాలు చేపట్టనున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ జి.ఏకాంబరం ఒక ప్రకటన లో తెలిపారు . ఆయా గ్రామాలలో ఈ ఆలయాలను నిర్మించాలి అనుకున్నవారు లొకేషన్, సైట్ ప్లాన్, సదరు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తే టిటిడి అధికారులు పరిశీలించి ఒక్కొక్క ఆలయానికి రూ.10,00,000/- చొప్పున నిధులను కేటాయించనున్నారన్నారు. ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఖచ్చితంగా ఈ అనుమతులు కావాల్సి వుంటుందన్నారు.
గ్రామాలలోని దళితవాడలు, ట్రైబల్ ఏరియా, మత్సకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాలలో మరియు ముఖ్యమైన ఆలయములు లేనిచోట పరిగణించబడుతుందని, గుర్తించిన ప్రాంతంలో 10 సెంట్లు స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించాలని, ఆయా ప్రాంతంలో ఎలాంటి ఆలయాలు లేవని సంబంధిత గ్రామస్థుడు దేవాదాయ శాఖకు అర్జీ సమర్పించాలని, టీటీడీ జారీచేసిన డిజైన్ లోనే రాష్ట్రంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.