రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.1190.11 కోట్లతో లక్షన్నర హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ విస్తరింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖాధికారులు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఎం.శంకర నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ప్రతి ధాన్యపు గింజనూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేల ద్వారా ‘ఈ పంట’ లోని Paddy Procurement Online పోర్టల్ లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనివల్ల దళారులు/మధ్యవ్యర్తుల ప్రమేయం ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత 21 రోజుల్లో రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.90 లక్షల మంది రైతులు 13.43 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేస్తున్నారన్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 2021-21 సంవత్సరానికి సంబంధించి మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.1190.11 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్లు కలిగిన రైతులకు 70 శాతం, 5 హెక్టార్లు కలిగిన ప్రకాశం జిల్లా మినహా మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల రైతులకు 50 శాతం మేర సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రబీ సీజన్ లో నేటి వరకూ ఎన్ని టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశారని సివిల్ సప్లయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ సప్లయ్ శాఖ ఈవో కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, 2020-21 పంటల కాలానికి సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ 3,78,206 మంది రైతుల నుంచి రూ.4,728.81 కోట్ల విలువ చేసే 25,25,927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఎంత వరి పంట ఉన్నా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వాణిజ్య పంటల కొనుగోలు వివరాలను మార్క్ ఫెడ్ అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. నగదు జమలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తనకు దృష్టికి తీసుకురావలని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతును ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అన్నదాత సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ, ప్రతి రైతుకూ ఆర్థికంగా మేలు కలుగజేయాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపితే, అధికారుల సాయంతో వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, మార్క్ ఫెడ్ ఎం.డి. ప్రద్యుమ్మ, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఎం.డి. సూర్య కుమారి, మైక్రో ఇరిగేషన్ పీవో హరనాథ్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.