ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవర్టు అధికారులు తలనొప్పిగా తయారయ్యారు..ప్రభుత్వ శాఖల్లోని పనిచేసే కొందరు అధికారులు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను ముందుగానే లీక్ చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం చేయాలనుకున్న కొన్ని కీలకమైన పనుల విషయంలో వీరి వలన అవరోధాలు ఏర్పడుతున్నాయి. అలాంటి వారంతా గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ సమాచారం అందిస్తే..వారు వారి అనుకూల మీడియాకి ఉప్పు అందించి ప్రభుత్వంపై బురదచల్లే పనికి తెగబడుతున్నారనేది ఇటీవల కాలంలో పలు అంశాల్లో తేట తెల్లమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదనే నానుడికి తగ్గట్టుగా ప్రభుత్వ శాఖల్లోని కొందరు పెద్దస్థాయిలో వున్న అధికారులే ప్రభుత్వ సమాచారాన్ని చాలా తెలివిగా బయటకు తీసుకురావడంలో సఫలీక్రుతులవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అనుకూల మీడియా వున్నప్పటికీ ప్రతిపక్ష నేతల అనుకూల మీడియా బయటకు తీసే కొన్ని కీలకమైన వ్యవహారాలపై కౌంటర్ ఇచ్చే దైర్యం కూడా చేయలేకపోతుంది. దీంతో ఇపుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం చేయాలనుకున్న పనిని కొన్ని సందర్భాల్లో ఒక వర్గం మీడియా ప్రజలను భయపెట్టేవిధంగా, ప్రభుత్వంపై చెడు ప్రభావం పడే విధంగా చేయడంలో కీలకభూమిక పోషిస్తుంది. ఈవిషయంలో ప్రభుత్వంలోని కొందరు అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడం వలనే ప్రభుత్వ వ్యతిరేక మీడియా అనుకున్నది చేయగలుగుతోందని చెబుతున్నారు. అందులోనూ ప్రభుత్వం కూడా మీడియాను పట్టించుకోకపోవడం, కావాలనే పక్కన పెట్టడం, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించడంతో కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పటికీ వాటిని ప్రజల ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చయడం లేదు. అదేస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక మీడియ చేస్తున్న ప్రచారాన్ని తమకున్న నెట్వర్క్ తో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెరసీ ప్రభుత్వంలోని కోవర్టులు ఇచ్చే కీలక సమాచారంతో ప్రభుత్వ వ్యతిరేక మీడియా ప్రజలను విభిన్నంగా ఆలోచింపజేసే విధంగా తమ వార్తా కధనాలను వండి వార్చేస్తుంది. ఈ విషయంలో మంత్రులు గానీ, ఎంపీలు గానీ, చిన్న చితకా ప్రెస్ మీట్లకే పరిమితం అవడం తప్పా.. ఆ కీలక సమాచారం ఎలా బయటకు వెళ్లిందనే విషయంలో ద్రుష్టిసారించకపోవడం కూడా ఇపుడు రాష్ట్ర్యంలో చర్చనీయాంశం అవుతుంది.