సచివాలయ మిగులు ఉద్యోగాల భర్తీఎప్పుడు..
Ens Balu
7
తాడేపల్లి
2021-06-14 02:00:04
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీకి గ్రహణం వీడటం లేదు. సుమారు లక్ష ఉద్యోగాలు తొలి దశలో భర్తీ చేసిన ప్రభుత్వం మిగిలిపోయిన సుమారు 26వేల ఉద్యోగాలకు రెండవ సారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అన్నిజిల్లాల్లో సిబ్బందిని నియమించలేదు. సుమారు 8వేల ఉద్యోగాలకు పైగా సచివాలయ ఉద్యోగాలు ఇంకా భర్తీ కాకుండా అలానే మిగిలిపోయాయి. ఇదే సమయంలో కొంత మంది గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు గతంలో రాసిన గ్రేడ్-4 కార్యదర్శి ఉద్యోగాలు రావడంతో ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో చేరిపోయారు. ఆ సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. సచివాలయంలో అత్యధికంగా గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలు, వెటర్నరీ అసిస్టెంట్లు, సెరీకల్చర్ అసిస్టెంట్లు, పోస్టులు అధికంగా ఖాళీలు ఉండిపోయాయి. మిగిలిన శాఖలైన హార్టికల్చర్, గ్రామ కార్యదర్శిలు పోస్టులు తక్కువగానే ఉన్నాయి. మరికొంత మంది వివిధ శాఖల్లో అప్పటికే పరీక్షలు రాసి ఉండటంతో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లోకి చేరిపోయారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉండిపోయిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు భర్తీకాలేదు. మధ్యలో వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన ఖాళీల గుర్తింపు కూడా జరగలేదు. దీనితో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందే డిప్యుటేషన్లపై ఇతర సచివాలయాల్లోని డిప్యుటేషన్ పై అదనంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నియామకాలు చేపట్టలేదు. ఆ తరువాత కరోనా వైరస్ విజ్రుంభించడంతో ఆ వ్యవహారం పూర్తిగా మూలకు చేరింది. కొన్ని జిల్లాల్లో విధుల్లోకి చేరిన సిబ్బంది ద్వారా మాత్రం ప్రస్తుతం సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లోని గ్రామసచివాలయాల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై కూడా నేటికీ క్లారిటీ రాకపోవడం విశేషం. తొలుత సచివాలయ ఉద్యోగాల్లో చేరినప్పటికీ, జీతం కేవలం మొదటి రెండేళ్లు 15వేలు మాత్రమే ఇవ్వడంతో చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అలా ఖాళీ అయిన స్థానాలను కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరుకే ఎపీపీఎస్సీ కేలండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. అటు దీనితో గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీ కాకుండా ఉండిపోయింది. ఈ కరోనా ప్రభావం తగ్గేవరకూ మళ్లీ ప్రభుత్వం సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీపై ద్రుష్టిపెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందులోనూ అమలాపురం వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రామక్రిష్ణరాజు సచివాలయ ఉద్యోగులపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాయడంపైనా చర్చజరుగుతోంది.. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సచివాలయ మిగులు ఉద్యోగాలని భర్తీ చేస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే రెబల్ ఎంపీ లేఖతో హడావిడీ చేయడం, దానిని ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హడావిడి చేయడంతోనూ ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఇప్పట్లో భర్తీచేయాలా..లేదంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఆరునెలల్లో రెగ్యులర్ చేసి ఆ తరువాత ఒకే సారి మిగులు ఉద్యోగాలను ఉద్యోగాల జాబ్ కేలండర్ విడుదల చేసి అందులో భర్తీచేయాలా అనే విషయంపై సమాచాలోచన చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది.. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!