రాష్ట్రంలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు..
Ens Balu
3
Mangalagiri
2021-06-14 15:29:50
ఆంధ్రప్రదేశ్ లోని 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 మున్సిపాలిటీల్లో 11, 12 చోట్ల భూములు గుర్తించామన్నారు. ఆర్టీసీపీఆర్ ల్యాబ్ ల ఏర్పాటు కోసం యూనిట్ల వారీగా వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై రెండు వారాల్లో విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ లు ఏర్పాటు చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. వైద్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీలేకుండా ముందుకు వెళుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సూపర్ స్పెషాలిటీ, మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అయిదు ఎకరాల గుర్తింపుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించినట్టు సింఘాల్ వివరించారు.