3,540 సచివాలయాల్లో కేసులు నిల్..


Ens Balu
2
మంగళగిరి
2021-06-14 15:37:43

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల వారీగా డేటా పరిశీలిస్తే కేసులు తగ్గుతున్నాయనేది అవగతమవుతుందన్నారు. రాష్ట్రంలో 15 వేల వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. వాటిలో గడిచిన 24 గంటల్లో 3,540 సచివాలయాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం ఒక్క కేసు 2,637 సచివాలయాల్లో, రెండు కేసులు 1,961 సచివాలయాలు, మూడు కేసులు 1500 సచివాలయాల్లో నమోదయ్యాయన్నారు. సున్నా నుంచి 3 కేసుల వరకూ 9 వేల పైన సచివాలయాల్లో(60 శాతంపైగా) నమోదయ్యాయన్నారు. 15 సచివాలయాల్లో 50 కేసులు, 18 సచివాలయాల్లో 40 కేసులు, 40 సచివాలయాల్లో 30 కేసులు నమోదయ్యాన్నారు. ఇలా 70 సచివాలయాలు... 0.5 శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారన్నారు. కేసులు తగ్గుతున్నాయని 104 కాల్ సెంటర్ నిర్వహణపైనా, ఫీవర్ సర్వేపైనా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రస్తుతమున్న స్ఫూర్తిని మరికొంతకాలం పాటు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో నేటి వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 1,328 యాక్టివ్ కేసులు అని తెలిపారు. 

ఈ కేసుల్లో 538 మందికి ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, 577 మందికి పొసకొనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నామన్నారు. 157 మంది మృతిచెందారని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32,285 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు అన్ని జిల్లాలకు కేటాయించామని, ప్రస్తుతం 10,759 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 1,39,980 పొసకొనజోల్ ట్యాబ్ లెట్లు అన్ని జిల్లాలకు అందజేశామన్నారు. అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లోనూ అదనంగా  పిడియాట్రిక్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలని సోమవారం నిర్వహించిన కొవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇపుడున్న ఐసీయూ బెడ్ల కంటే అదనంగా ఐసీయూ బెడ్లు పెంచాలన్నారు. ఆరు నెలల చిన్నారుల కోసం అవసరమైన బెడ్ల పెంపుదలపైనా చర్చించామన్నారు. ప్రైవేటు టీచింగ్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, సిబ్బంది నియామకంపైనా అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారన్నారు.  ఆరోగ్య శ్రీ పథకంలో పిడియాట్రిక్ కేసుల చేర్పుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు.