ఈ-హాస్పిటల్ అందుబాటులోకొచ్చేనా..


Ens Balu
1
Tadepalle
2021-06-22 02:11:02

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఈ-హాస్పిటల్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా గత ప్రభుత్వం హయాంలో ఈ-హాస్పిటల్ ను అభివ్రుద్ధి చేసి పేపర్ లెస్ ఆస్పత్రులను ప్రజలకు అందించాలని అప్పటి ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య సంకల్పించారు. ఆమె ప్రభుత్వ శాఖ, ప్రభుత్వం కూడా మారిపోవడంతో ఆ తరువాత మళ్లీ ఆ ఊసే ప్రభుత్వం ఎత్తలేదు. రూ1000 దాటితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలని భావించిన ప్రభుత్వం ఈ-హాస్పిటిల్ ను మాత్రం అందుబాటులోకి తీసుకువస్తుందని అంతా భావించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.. ఈ-హాస్పిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ డిస్పెన్సరీలు, పీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోకి కావాల్సిన వసతులు, మందులు, ల్యాబ్ పరికరాలు, యంత్రాలు, సిబ్బంది ఖాళీలు మొత్తం అన్నీ ఒకే వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వం తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా ఒకే రకమైన మందులు కొనుగోలు చేసి అవి వినియోగంలోకి రాక చాలా చోట్ల మందులు అధికంగా వ్రుధా అవుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల రోగాలకు కావాల్సిన మందులు కొనుగోలు చేసి అందించే ఏర్పాటు చేయవచ్చు. పైగా ఏ రకం మందులు ప్రజలు అధికంగా ఉపయోగ పడుతున్నాయో కూడా తెలుసుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీచేయాలనుకున్నా, వసతులు కల్పించాలన్నా, ఎపడమిక్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాలన్నా ఒకేసారి జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ కోరే పనుండదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాలకు ఖాళీల విషయమై ప్రతీసారి ఫైల్ రన్ చేసే ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ-హాస్పిటిల్ విధానం ద్వారా ఆన్ లైన్ లోనే రోగి ఆధార్ కార్డు లేదా, ఫోన్ నెంబరు ఆధారంగా వివరాలు నమోదు చేసి..ఏ రోగి రోగానికి ఏ తరహా మందులు ఇచ్చారు, ఏ తరహా రక్తపరీక్షలు చేశారు, ఎలాంటి మందులు చీటీ రాశారు, రాసిన మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్నాయా లేదా, ఇంకా ఎలాంటి టెస్టులు చేయాలి, ఆసుపత్రిల్లో అందించే సేవలు అనేవివరాలు ఇలా అన్నీ ఒక ప్రత్యేక ఫామ్ లో నమోదు అవుతాయి. తద్వారా ప్రభుత్వానికి కూడా ఎంత మంది ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించారో ఆధారాలతో సహా ప్రకటించడానికి వీలుపడుతుంది. ఇదే విషయాన్ని జిల్లాలోని డిఎంహెచ్ఓలు, రాష్ట్రస్థాయిలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా వివరాలు ఈ హాస్పిట్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వం అందించే సేవలు కూడా అన్ని కార్యక్రమాలు మాదిరిగానే మీడియా ద్వారా ఏఏ సేవలు ప్రజలకు అందించారో కూడా తెలియజేయడానికి ఆస్కారం వుంటుంది. ఇన్ని సదుపాలయాలతోపాటు పేపర్ లెస్ ఆసుపత్రిగా మార్చడం ద్వారా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలని నాడు సంకల్పించారు. ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీలో ఏ తరహా రోగులు వస్తున్నారనేది పర్శంటేజీ రూపంలో ప్రభుత్వానికి తెలిసే అవకాశం వుంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మందులు, ఇతర సదుపాయాలు కల్పించడానికి, ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి అవకాశం వుంటుందనేది ఈ-ఆసుపత్రి ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతీఏడాది జాబ్ క్యాలెండర్ తీయడానికి సన్నద్దమైన నేపథ్యంలో పీహెచ్సీనుంచి జిల్లా ఆసుపత్రి వరకూ సిబ్బంది ఖాళీల వివరాలు కూడా ఏకకాలంలో తెలుసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో ఖాళీలను భర్తీచేయడానికి వైద్యఆరోగ్యశాఖ వివరాలు అందుబాటులోకి వస్తాయి.  ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఇదే విధానాన్ని అవలంభిస్తూ..అనవసర మందుల వినియోగాన్ని తగ్గించుకుంటూ పేపర్ లెస్ ఆసుపత్రులగా అభివ్రుద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా వారికి కావాల్సిన సిబ్బందిని కూడా వారి రాష్ట్ర యాజమాన్యం ఆదేశాల మేరకు నియమాకాలు కూడా చేపడుతున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఫోన్ నెంబరు ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ-హాస్పిటిల్ వ్యవస్థ ఎంతో చక్కగా అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రప్రభుత్వం కూడా అవంభిస్తే ప్రజలకు గ్రామ స్థాయిలో ప్రాధమిక ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యం నెరవేరడంతోపాటు, జిల్లా ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. ఈ దశగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి మరి..!