ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తక్కువగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో మరోసారి గ్రామ,వార్డు సచివాలయ మిగులు ఉద్యోగాలు, పోలీస్ శాఖలో ఖాళీలు, భర్తీకాకుండా మిగిలిపోయిన ఉపాధ్యాయుల ఉద్యోగాలు, చాలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న కీలక జిల్లా పోస్టుల్లో అధికారులు డిప్యుటేషన్ పై పనిచేస్తున్న విషయం మరోసారి తెరపైకి వచ్చాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో మిగిలిపోయిన సుమారు 9వేల ఉద్యోగాలను వచ్చే ఏడాది జాబ్ కేలండర్ లో ప్రకటిస్తారనే సమాచారం ప్రచారంలోకి వచ్చేసింది. నెల రోజుల క్రితం సచివాలయ వ్యవస్థలో సుమారు 9వేల మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆగస్టులో 6వేల పోలీసు సిబ్బంది ఖాళీలను భర్తీచేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత చేసిన ప్రకటనలనే ఇపుడు నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు. ప్రతీ ఏడాది 18వేల ఉద్యోగాలకు తక్కువ లేకుండా అన్ని రకాల ఉద్యోగాలను జాబ్ కేలండర్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారని మంత్రులు ఒకరి తరువాత ఒకరు ప్రకటిస్తున్నారు. నేటి వరకూ ప్రధాన ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలతో పాటు సచివాలయంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుమారు 500 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఉపాధ్యాయ ఉద్యాగాల్లోకి చేరిపోయారు. వీటితోపాటు చాలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండిపోయిన ఖాళీల కారణంగా కొందరు అధికారులతో డిప్యూటేషన్ పద్దతిపై ప్రభుత్వం అదనపు ఉద్యోగం చేయిస్తుంది. రాష్ట్ర ఖజానాను ద్రుష్టిలో పెట్టుకొని మాత్రమే తక్కువగా పోస్టుల భర్తీ తొలి జాబ్ కేలండర్ లో ప్రకటించారని చెబుతున్నా.. ముఖ్యంగా విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టులకి సంబంధించి డిఎస్సీ ప్రస్తావన లేకపోవడం కూడా నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత అధికంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీచేసింది. మిగిలిన ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వం చేపట్టిన వాటినే దఫ దఫాలుగా భర్తీచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరంతం ఆందోళనలు చేపడుతున్నారు. దీనితో రంగంలోకి దిగిన వివిధ శాఖల మంత్రులు నిరుద్యోగులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే జాబ్ కేలండర్ మార్చినాటికి వస్తుందని దానిలో మిగులు ఉద్యోగాల భర్తీచేడతామని, అంతేకాకుండా కరోనా సమయంలో అత్యధిక ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం మంచిది కాదనే భావనతోనే ప్రభుత్వం తక్కువగా ఉద్యోగాల భర్తీ చేపడుతుందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని పేర్కనడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏది ఏమైనా జాబ్ కేలండర్ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. అంతేకాకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోలేదో కూడా క్లారిటీ ఇవ్వకుండా వాటిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే జాబ్ కేలండర్ లో చూపించడం నిరుద్యోగులకి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో మంత్రల ప్రచారం మేరకు వచ్చే ఏడాది ఎన్ని ఖాళీల భర్తీకి జాబ్ కేలండర్ వస్తుందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.. వచ్చే జాబ్ కేలండర్ లో నైనా ఉద్యోగాల సంఖ్య పెంచుతారా లేదంటే ఇదేస్థాయిలో ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి..!