మళ్లీ తెరపైకి సిపిఎస్ రద్దు అంశం..


Ens Balu
5
Tadepalle
2021-06-23 02:10:11

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం జాబ్ కేలండర్ ప్రకటించిన తరుణంలో మరోసారి ఉద్యోగుల సిపిఎస్ రద్దు అంశం తెరపైకి వచ్చింది. పాదయాత్ర సమయంలో ప్రకటించిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా సీపిఎస్ రద్దు విషయమై ప్రభుత్వం నేటికీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంలోనే అటు ప్రతిపక్షపార్టీల నేతలతో కొందరు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన కోవర్టు నేతలతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటిస్తే ఉద్యోగులకు తరచుగా పీఆర్సీ అమలు చేయడంతోపాటు, ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెబుతున్నారట. పేద ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో నగదు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని..ఈ ప్రభుత్వంలో మీ డిమాండ్ నెరవేరదనే కోణంలో రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వం ఉద్యోగులు రెండు నెలల క్రితం కోవిడ్ ఉందనే కారణంలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లల్లోనే తమ నిరసన తెలియజేశారు కూడా. ఈ సందర్భంలో ప్రతిపక్షపార్టీల నేతలు చేస్తున్న రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కేవలం లక్షా 16వేలమంది ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సుమారుగా ఆరు లక్షల పైచీలుకే ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు సిపిఎస్ రద్దు విషయంలో కలిసి రాకపోయినా..ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బలం అధికంగానే వుంది. ఉన్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనే నిరసన మళ్లీ ఉద్రుతం చేయాలని ఉద్యోగ సంఘాలు, సీపిఎస్ యూనియన్ నాయకులు భావిస్తున్నారట. పాదయత్ర సమయంలో రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు, ఆర్టీసీ ఉద్యోగులను కార్పోరేషన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు తదితర అంశాలను ప్రభుత్వం నెరవేర్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు, పీర్సీ అమలు, డీఏ ఇచ్చే విషయమంపై నేటికీ ప్రకటన చేయలేదు. అంతేకాకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ అంశంలో మంత్రుల కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. దీనితో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సీపిఎస్ రద్దు కోరుతూ ఉద్యమం చేసి తమ నిరసనను తెలియజేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మాత్రం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సీపిఎస్ రద్దు హామీ ఇచ్చిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వైఎస్సార్సీపీకి తమ మద్దతు తెలియజేశారు. కానీ రెండేళ్లు దాటిపోతున్నా..ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అసలు సిపిఎస్ రద్దు చేస్తుందా లేదా..అనేవిషయంలో క్లారిటీ లేకపోతే తమ మద్దతును ప్రభుత్వానికి ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగుల సిపిఎస్ రద్దు అంశం 2024 ఎన్నికల్లో ప్రభుత్వానికి మరోసారి మద్దతు తెలియజేస్తే అమలు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చూస్తుందని, వచ్చే ఎన్నికలకు దీనిని వినియోగించుకోవాలని ప్రభుత్వంలోని సలహాదారులు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారని చెబుతున్నారు. ఆ కారణంగానే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చూపించే శ్రద్ధ వాటిని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దుపై చూపించలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.  సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఒక నిర్ధిష్ట ప్రకటన చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇస్తారా లేదా ముందుగా ఆఫర్ చేస్తున్న ప్రతిపక్షాలకు చేయందిస్తారా అనేది నేడు ప్రధాన చర్చజరుగుతుంది..ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి..!