రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం(జూన్ 24) నుంచి పర్యాటకులను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించామన్నారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంచుకునే చర్యలు తీసుకోనున్నామన్నారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నామన్నారు. కొవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదన్నారు. అంతకుముందు పర్యాటక, క్రీడల అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బోటుల నిర్వహణకు రాష్ట్రంలో వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ ను ఆదేశించారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజంలో అవినీతికి అడ్డుట్ట వేస్తూ, చిత్తశుద్ధితో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సాహించాలన్నారు. పర్యాటక శాఖ పరధిలో ఉన్న హోటళ్ల ట్రేడ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ట్రేడ్ రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు.