GMSK,WMSKలు ఇక పోలీసులే..


Ens Balu
1
Tadepalli
2021-06-24 01:32:25

గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సంరక్షణా కార్యదర్శిలు/మహిళా పోలీసులంటే మీరేమైనా నిజమైన పోలీసులు అనుకుంటున్నారా.. హోంగార్డు కంటే తక్కువ స్థాయి.. మీరు కేవలం గ్రామాల్లోని సమాచారం మాత్రమే మాకు పంపాలి..అంతకు మించి నిజమైన పోలీసుల్లా ఫీలైపోతే మీ ఉద్యోగాలు తీయించేస్తాను..ఇదో స్టేషన్ లో ఎస్ఐ నుంచి హోంగార్డు కూడా ఇచ్చిన వార్నింగ్.. అసలు మీరేమనుకుంటున్నారు..మహిళా పోలీస్ అంటే అంగన్వాడీలపై పెత్తనం చలాయిద్దామనుకుంటున్నారా.. అలాంటివి నా దగ్గర పనిచేయవు మేము చెప్పినట్టు చేయాలి.. లేదంటే పైకి రాసేస్తాం మీ ఉద్యోగాలు పోతాయ్ ఐసిడిఎస్ లో ఇదొక సిడిపిఓ బెదిరింపు.. నిన్నగాక మొన్న వచ్చి ఎంతో కాలంగా పనిచేస్తున్న అంగన్వాడీల మీ పెత్తనం ఏంటి, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే అర్జెంటుగా ఇచ్చేయాలా.. మా యూనియన్ లో మాట్లాడుకొని ఇస్తాం..ఇప్పటికిప్పుడు అంటే కుదరదు.. ఇదొక అంగన్వాడీ కార్యకర్త రుబాబు..ఇవన్నీ గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు తరుచూ వచ్చే బెదిరింపులే.. ఇవి కాకుండా మండల అధికారుల విషయమైతే చెప్పాల్సిన పనేలేదు అవి మాటలకి అందవు ఇవన్నీ జూన్ 22-2021 వరకూ మాత్రమే జరిగాయి.. కట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శి(GMSK,WMSK)లను ప్రభుత్వం సాధారణ పోలీసులుగా మార్చేసింది. ఈమేరకు ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబరు 59ని  ఈనెల 23న విడుదలచేస్తూ సాధారణ పోలీసులకు ఏ విధమైన అధికారాలు, విధులు ఉంటాయో వీరికీ అదే తరహా విధులు ఉంటాయని ఆ జీఓలో స్పష్టం చేస్తూ ఏపీ గెజిట్ లో నమోదు చేయడం విశేషం. దీనితో మహిళాపోలీసులపై కాస్త అతిచూపించే అధికారులు, ఇతర సిబ్బంది గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. అంతేకాకుండా వీరి సర్వీసులో ప్రమోషన్ వస్తే అదనపు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందుతారని  కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా ఇకపై మహిళా పోలీసులందరికీ కాకి డ్రెస్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీ సచివాలయ పరిధిలో కాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులు అందుబాటులో ఉంటే గ్రామంలోని అల్లర్లతోపాటు, మహిళలకు రక్షణ కూడా అధికంగా వుంటుందని ప్రభుత్వం భావించింది. ఇటీవలే ప్రకాశం బ్యారేజి దగ్గర చోటు చేసుకున్న(యువతిపై సామూహిక అత్యాచారం)ఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా ఉండాలన్నా, గ్రామస్థాయిలో కష్టం వచ్చిన వెంటనే మహిళలు సచివాలయనాకి వచ్చి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా, దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నా జిఎంఎస్కేలను పోలీసులుగా చేస్తే తప్పా పరిస్థితి గాడిలోకి రాదని ప్రభుత్వం భావించినట్టు ఈ జీఓ ద్వారా స్పష్టంగా కనిపించింది. దానికోసం రాష్ట్రస్థాయిలో డిజిపీతో సహా ఇతర పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్య కార్యదర్శితో పాటు పలు శాఖల అధికారులతో చర్చలు జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సచివాలయాల్లో పనిచేసే పోలీసులు వీరికి అనుసంధానంగా ఉంటారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు చేసే ఫిర్యాదులన్నీ మహిళా పోలీసుల ద్వారానే పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అవుతాయి. త్వరలోనే వీరికి డ్రెస్ కోడ్ తోపాటు ఒక ట్యాబ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం వస్తోంది. దాని ద్వారా గ్రామాల్లోని అత్యవరసర, గొడవలను, ప్రత్యేక పరిస్థిని ఎప్పటి కప్పుడు ఫోటోలు, వీడియోలు, కేసుల రూపంలో గ్రామ మహిళా పోలీసులు స్టేషన్ ఎస్ఐకి నివేదించే విధంగా ప్రత్యేక మార్పులు కూడా చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మహిళా పోలీసులు, హెల్త్, ఐసిడిఎస్, విలేజ్ సెక్యూరిటీ  సర్వీసుల్లో కీలకంగా వ్యవహరించారు. ఇకపై వారిని హోంశాఖలో సాధారణ పోలీసులుగా మార్చడంతో గ్రామస్థాయిలో ఒక పోలీసునే ప్రత్యేకంగా  నియమించినట్టు అయ్యింది. పైగా కింది స్థాయి ఉద్యోగులను చులకనగా చూసిన అధికారులకు, సిబ్బందికి జీఓనెంబరు 59 ద్వారా చెక్ చెప్పినట్టు అయ్యింది. పైగా వీరు విధుల్లోకి చేరి ఏడాదిన్నర గడుస్తున్న సందర్భంగా నెల రోజుల క్రితమే వీరికి ప్రభుత్వం సర్వీసు రిజిస్టర్లను కూడా పూర్తిచేసింది ప్రభుత్వం. మరో ఆరు నెలలు గడిస్తే మహిళా పోలీసుల సర్వీసు కూడా రెగ్యులర్ అవుతుంది. అంతకు ముందే ప్రభుత్వం వీరిని సాధారణ పోలీసులగా మార్పు చేస్తూ ఇచ్చిన జీఓ సాహసోపేతమని పోలీసు, వైఎస్సార్సీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇకవీరంతా ఖాకీ డ్రెస్సుల్లో విధులకు రావడం ఒక్కటే తరువాయి. గ్రామంలో మహిళా పోలీసును అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వం మహిళల కోసం ఎంతో శ్రద్ధ తీసుకుందని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.