ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోర్సులపై అధ్యయనం..


Ens Balu
3
Tadepalli
2021-06-27 04:16:19

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డ్రిగీ కాలేజీల్లో ప్రస్తుతం నడుస్తున్న కోర్సులపై అధ్యయనం చేసి కొత్తకోర్సులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికోసం ఉన్నతవిద్య, సాంకేతిక విద్యా కమిషనర్ డా.పోలా భాస్కర్ ప్రత్యేకంగా ద్రుష్టిసారించారు. సాధారణ డిగ్రీ కోర్సుల వలన కేవలం డిగ్రీలు మాత్రమే చేతికొస్తున్నాయని, అలా కాకుండా డిగ్రీ పూర్తికాగానే ఉపాది, ఉద్యోగ అవకాశాలు కలిగే కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు మార్గాలు వేసేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 70శాతం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కేవలం బిఏ, బీకాం, బిఎస్సీ కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం సిబిజెడ్, బిఎస్సీ ఎంపీసి కోర్సులు నడుస్తున్నాయి. ఇలా కాకుండా హార్టికల్చర్, సెరీకల్చర్, బిఎస్సీ ఎలక్ట్రానిక్స్,  కంప్యూటర్ సైన్స్ కోర్సులతోపాటు ప్రత్యేక ల్యాబ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయిన తరువాత ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిధిలోని పరిశ్రమలు, కంపెనీలు, పెద్ద పెద్ద ప్రభుత్వ శాఖల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇటీవల విశాఖలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ ఈ దిశగా ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివితే ఖచ్చితంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయనే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఏ తరహా కోర్సులు నడుస్తున్నాయి, కొత్తగా ఏ తరహా కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్ధులకు ఉపయోగం ఉంటుందనే విషయమై అధ్యయనం చేసి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని అన్నారు. అంతేకాకుండా అన్ని డిగ్రీ కాలేజీలు ఖచ్చితంగా నాక్ గుర్తింపులో ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండేలా సదుపాయాలు కల్పించాలన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఇపుడు ఆన్ లైన్ పేమెంట్లకు, ఈ-ఆఫీస్,  ప్రత్యేక మొబైల్ యాప్ లను అభివ్రుద్ధి చేసినట్టు కమిషనర్ పోలాభాస్కర్ వివరించారు. డిగ్రీ కాలేజీలో చేపట్టే నూతన అంశాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఆయన ప్రత్యేకంగా వివరిస్తున్నారు. కమిషనర్ చెప్పిన విధంగా ప్రాధమిక మార్పులు చేసినా, చాలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రావడంతోపాటు, లైబ్రెరీలు, ఇంగ్లీషు ల్యాబ్ లు, ఉపాది, ఉద్యోగ శిక్షణలు అన్నీ విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.