ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆదివార సెలవులకు మంగళం పాడాలని చూస్తున్నట్టు కోవిడ్ వేక్సిన్ ద్వారా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకూ పనిచేయాలని అవకాశం కల్పించిన సమయంలో కూడా సచివాలయ ఉద్యోగులకు ఆ సౌకర్యం అమలు చేయకపోగా.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ పనిచేయించింది. ఇపుడు తాజాగా వారంలో ఒక్కరోజు వచ్చే ఆదివారం సెలవులకు మంగళం పాడి ఆరోజు కరోనా వేక్సిన్ టీకా కార్యక్రమాలు పెడుతోంది ప్రభుత్వం. సెలవురోజుల్లో వేక్సినేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు ఉదయం 8గంటల నుంచి సాయంత్ర ఆరు, ఏడు గంటల వరకూ వేక్సినేషన్ కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధామని ప్రశ్నించిన ఉద్యోగులకు చెప్పింది చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయని, పైకి రాసేస్తామని మండల అధికారులు బెదిరస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించడంతో భయం భయంగా కేంద్రాల వద్ద కోవిడ్ డ్యూటీలు చేస్తున్నామని చెబుతున్నారు. కేంద్రాల వద్ద కనీస శానిటేషన్ లేకపోగా, శానిటైజర్లు గానీ, డెటాల్ గానీ, హేండ్ గ్లౌజులు గానీ, హైపో సోడియం పిచికారీ కూడా ప్రభుత్వం చేపట్టడం లేదంటే అతిశయోక్తి కాదు.. మాస్కులు, శానిటైజర్లు, హేండ్ గ్లౌజులు ఇలా అన్నీ విధులకు వచ్చే సచివాలయ సిబ్బందే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మూడు దఫాలు ఆదివారం రోజులు కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేసి వారి సెలవులను కోల్పోయోలా చేసింది ప్రభుత్వం. కనీసం ఆదివారం సెలవురోజు డ్యూటీలు చేసినందకు మరో రోజైనా సెలువులు ప్రభుత్వం మంజూరు చేస్తుందా అదీకనిపించడం లేదని సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఒక్కరోజు దొరికే సెలవు రోజున వారాంతం నిండిపోయిన బట్టలు ఉతుక్కోవడానికి కూడా సమయం దొరకడం లేదని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు కరోనా వేక్సినేషన్ లక్ష్యాలను కూడా వైద్య ఆరోగ్యశాఖలో ఆశ, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, రెండవ ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తులు ఉన్నప్పటికీ వారికి ఏమీ చెప్పకుండా తమకే ప్రజలను వేక్సిన్ వేక్సిన్లు వేయించే టార్గెట్లు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కోవిడ్ వేక్సినేషన్ కు ముందుకి రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏ విధంగా పరిగణిస్తో అర్ధం కావడం లేదని వీరాంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు, తమకు జీతాలు, విధుల్లోనే కాకుండా ప్రభుత్వం పరిగణించే విషయంలోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
సచివాలయ ఉద్యోగులు రెండు కోవిడ్ టీకాలుు పూర్తిచేసుకున్నా..కోవిడ్ కేంద్రాల వద్ద డ్యూటీలు చేసేవారే కరోనా భారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పత్రీ పది గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం సచివాలయానికి ముగ్గురు సిబ్బంది చొప్పున ఇపుడు పాజిటివ్ భారిన పడి వైద్యం పొందడం కూడా తమకు భయాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు వారికి కరోనా ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా నేరుగా కోవిడ్ వేక్సినేషన్ కు రావడ వలన, వారికి ఇచ్చే టోకెన్లు తాము అలా తీసుకోవడం వలన వారి కరోనా వైరస్ తమకు సోకుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మండల అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వేక్సిన్ కార్యక్రమం ఆదివారం, సెలవురోజుల్లో ఏర్పాటు చేస్తే అపుడు విధుల్లో పాల్గొన్నా వారికి ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆదివారాల సెలవులు, విధులు, ఇబ్బందులు, సమస్యల కోసం ఎవరితో మాట్లాడాలనుకున్నా మండలస్థాయి అధికారుల నుంచి బెదిరింపులే ఎదురవుతున్నాయి తప్పితే తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. పైగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా ఆదివారాలు పనిచేయలేరా అని తిరిగి ప్రశ్నిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ఆదివారాల సెలవు రోజుల్లో వారితో కరోనా వేక్సిన్ విధులు నిర్వహించినందుకు వారికి ప్రత్యామ్నాయ సెలవులు ఇస్తుందా...వాటిని పరిగణలోకి తీసుకోకుండా అలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి..!