రాష్ట్రానికి జూలై నెలకు సంబంధించి ఏపీకి 53,14,740 కోవిడ్ డోసులు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలాఖరు నాటికి 31 లక్షల మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. 24,36,787 మందికి కొవిషీల్డ్, 6,88,190 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమిచ్చే 53.14 లక్షల టీకాల్లో 31 లక్షల మందికి సెకండ్ డోసుగా వేయనున్నామన్నారు. కాగా
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 7,998 మంది ఉండగా, వారిలో 7,488 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 93.62 శాతం మంది ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 2266 మంది చికిత్ప పొందుతుండగా, 1.756 మంది (77.49 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామన్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకున్నవారున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయస్సు తల్లులు 18,75,866 మంది ఉండగా, నేటి వరకూ 12,99,500 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి సెకండ్ డోసు వేసుకోవాల్సిన వారు 3 లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికీ రాబోయే మూడ్రోజుల్లో రెండో డోసు వేస్తామని తెలిపారు. వారిలో 1,30,000 మంది కొవిషీల్డ్, 1,92,000 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు వేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,41,000 డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని మంగళవారం నాటికి వినియోగించే అవకాశముందని తెలిపారు.