ఈ నెలాఖరుతో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రెండు కేటగిరీలుగా కొత్తగా కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 8 జిల్లాల్లో జూలై 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చి, ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుందన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరవాత అన్ని దుకాణాలు, ఇతర సముదాయాలు మూసివేయాలన్నారు. ఇలా వారం రోజుల పాటు కొత్త కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.