ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్..


Ens Balu
2
Tadepalle
2021-06-29 02:08:01

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఏపీ హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా.పోలా భాస్కర్ చెప్పారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉన్నతవిద్యలో సమూల మార్పులు తేవడంతోపాటు, కాలేజీల్లోని అద్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది జాబ్ చార్ట్ ను కూడా ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లకు చెందిన కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని. ఇక ప్రతీ నెల ఒక్కో జోన్ లో ఈ తరహా సమీక్షలు జరుపుతామన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులు ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్న విషయాన్ని గుర్తించి దానిని గాడిలో పెట్టేందుకు యాప్ ప్రవేశపెట్టామని, వాటి నుంచి ఫలితాలు ప్రారంభమయ్యాయన్నారు. అదేవిధంగా ఈ ఎకడమిక్ ఈయర్ లో రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల్లో 72వేల సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 42వేల మంది విద్యార్ధులు మాత్రమే చేరుతున్నారని, అలాకాకుండా శతశాతం  విద్యార్ధులను చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానికోసం అద్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను మ్యాపింగ్ చేసుకొని వారిని డిగ్రీకాలేజీల్లో చేర్పించే ప్రణాళికలు సిద్దం చేసినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నందున ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అద్యాపకులు, ప్రిన్సిపాల్స్ తమ విధులను పక్కాగా జాబ్ చార్ట్ ఆధారంగా నిర్వహించాల్సి వుందన్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశక్తిలేదని, ఉన్నత విద్యలో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్న కమిషనర్ ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టే భాద్యతను పెంచుతున్నట్టు వివరించారు.