SCSP నిధులు 100% ఖర్చుచేయాలి..


Ens Balu
3
Tadepalle
2021-06-29 12:55:13

రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వారికి సంక్షేమానికై ఎస్సి కాంపొనెంట్ కింద పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు. ఈమేరకు ఎస్సి కాంపొనెంట్ కు సంబంధించి మంగళవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో 27వ నోడలు ఏజెన్సీ ఆఫ్ షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్ (SCSP) సమావేశం మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.ఈనిధుల వినియోగంలో ఎంతమాత్రం జాప్యం లేదా అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన స్పష్టం చేశారు.2020-21లో షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కింద 44 శాఖలకు(HOD's) 19430 కోట్లు కేటాయించగా 13672 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 76%కంటే ఎక్కువ 12శాఖలు ఖర్చు చేయగా,25నుండి 51% 23శాఖలు ఖర్చు చేశాయని 9శాఖలు మాత్రం ఏవిధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ (SCSP) కింద 42 శాఖలకు 17403 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.ఇది గత ఆర్థిక సం.రం.కంటే 1667కోట్లు(10.06శాతం)అదనమని,2019-20 కంటే 2402కోట్లు(16%) అదనమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.కాగా మే 2021 నాటికి ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 4641 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.2021-22 ఆర్థిక సం.రం.లో ఎస్సిఎస్పి కింద అధిక నిధులు కేటాయించిన శాఖల్లో ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖకు 8059కోట్లు, వ్యవసాయ శాఖ 1680కోట్లు,గృహ నిర్మాణ శాఖ కు 1020కోట్లు, ఇంధన శాఖకు 810కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఎస్సి కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్ననేపధ్యంలో ఇందుకై కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేసేందుకు అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు.కొన్ని శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయలేక పొవడం,కొన్ని శాఖలు అసలు నిధులేమీ ఖర్చు చేయడం పోవడానికి గల కారణాలను విశ్లేషించి పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా చూడాలని వివిధ శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.తదుపరి త్రైమాసికంలో జరిగే సమావేశం సియం అధ్యక్షతన జరుగుతుందని కావున ఆలోగా వివిధ శాఖలన్నీ పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసేందుకు కృషి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

సమావేశానికి తొలుత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత స్వాగతం పలికారు.అనంతరం వివిధ శాఖల వారీగా ఎస్సిఎస్పి కింద కేటాయించిన నిధులు ఆయా శాఖలు ఖర్చు చేసిన నిధులు వివరాలను శాఖల వారీ సమీక్షించారు.
ఈసమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ హర్ష వర్ధన్,ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సోసైటీ కార్యదర్శి నవ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.