పదోన్నతులపై తొలగని సందిగ్ధత..
Ens Balu
9
Tadepalle
2021-07-01 02:54:35
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు చాలా మందికి తమ పదోన్నతులు ఎలా ఉండబోతాయనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగాలకు ఇన్ సర్వీసులో రెండు రకాలుగా పదోన్నతులు కల్పిస్తారు..సర్వీసు ఆధారంగా ఇచ్చే పదోన్నతి ఒకటైతే..ఇదే ఇన్ సర్వీసులో ప్రభుత్వం వారి విద్యార్హతను మెరిట్ ప్రాతిపదిక ఎంపిక చేసి వారికి జీతంతో కూడి చదువు చెప్పించి..ఆపై మండల స్థాయి అధికారులుగా కల్పించే పదోన్నతులు.. కానీ ఏపీలో సచివాలయ ఉద్యోగుల భర్తీయే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా జరగడంతో రెగ్యులర్ ఉద్యోగులకు, వీరికి మధ్య భారీ వ్యత్యాసాలు విధి నిర్వహణ దగ్గర నుంచి జీత భత్యాలలో కనిపిస్తున్నాయి.. ఇపుడు ఈ శాఖలోని ఉద్యోగులకు తమ పదోన్నతులు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను సాధారణ మహిళా పోలీసులుగా మార్చుతూ జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. వీరికి పదోన్నతి కూడా హెడ్ కానిస్టేబుల్ వుంటుందని పేర్కొంది. పేరుకి మహిళా పోలీస్ అయినప్పటికీ వీరు హోంశాఖలో పాటు, ఐసిడిఎస్, హెల్త్, కార్యాలయ సహాయకులు, ఇతర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మిగిలిన శాఖల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇచ్చిన ఒక్కశాఖ ఉద్యోగంతో నాలుగైదు శాఖలు విధులు నిర్వహించే మహిళా పోలీసులకు డిగ్రీ కంటే అధిక విద్యార్హత ఉన్నప్పటికీ, కేవలం ఇంటర్ తో సమానమైన కానిస్టేబుల్స్ కి ఇచ్చే సాధారణ ప్రమోషన్ మాత్రమే ఇవ్వడంతో తమకు ఏవిధమైన పదోన్నతులు వస్తాయోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ , హార్టికల్చర్, సెరీకల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ,శానిటేషన్ అసిస్టెంట్లకు తరువాత పదోన్నతులు ఏంటనే విషయంలో ప్రభుత్వం ద్వారా క్లారిటీరాలేదు. పంచాయతీ గ్రేడ్ 5 కార్యదర్శిలకు తరువాత పదోన్నతి గ్రేడ్4, అని డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్5 ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ వీరి ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలో డిప్లమా విద్యార్హతతో చేరిన ఉద్యోగులకు ఇన్ సర్వీసులో ప్రభుత్వమే బిఎస్సీ అగ్రికల్చర్ చదివించి వారికి మండల వ్యవసాయ అధికారిగా పదోన్నతి కల్పిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి నర్సులుగా పదోన్నతి కల్పిస్తుంది. కానీ సచివాలయ ఉద్యోగులకు కూడా ఆవిధమైన పదోన్నతులు వాస్తాయా అనేది క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే మహిళా పోలీసులంతా డిగ్రీ, పీజీ అంతకంటే అధికంగా పీహెచ్డీ విద్యార్హతతో కూడా మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి చేరారు. అయితే ప్రభుత్వం వారికి తదుపరి పదోన్నతి హెడ్ కానిస్టేబుల్ అని జీఓ ద్వారా తెలియజేయడంతో అంతా ఇపుడు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. వారి వినతులను ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వ విప్ ల ద్వారా తీసుకెళుతున్నారు. ఒక్కోశాఖలో ఒక్కోలా పదోన్నతులు ఇవ్వడమేమంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. అగ్రికల్చర్, వైద్యఆరోగ్యశాఖలో పదోన్నతులు ఇన్ సర్వీసులో ఇచ్చినట్టే మహిళా పోలీసులకు ఎస్ఐ లుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే.. ఆపై మిగిలిన శాఖలైన ఇంజనీరింగ్, సెరీకల్చర్, వెటర్నరీ, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖ సచివాలయ సిబ్బందికి పదోన్నతి విషయంలో క్లారిటీ ఇవ్వాలనే వాదన బలపడుతుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్త సచివాలయ గ్రూపుల్లో పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. గ్రామస్థాయిలో ఎంతో ఎక్కువ సేవలు అందించే తమకు సాధారణ ఉద్యోగుల కంటే అతి తక్కువ జీతాలు ఇవ్వడంతోపాటు, పదోన్నతుల విషయంలో కూడా ఎటూ తేల్చి చెప్పకపోవడంపై ఉద్యోగులంతా ఆగ్రహంగా వున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం సరైన మార్గం పదోన్నతుల విషయంలో చూపించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటని కూడా జోరుగా తమ తమ ఆలోచనలు ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో చర్చకు తెరలేపుతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు దగ్గర కూడా ప్రస్తావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినపుడు ఒక్కో శాఖకు ఒక్కోలా పదోన్నతులపై క్లారిటీ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులపై క్లారిటీ ఇస్తే..ఈ ఉద్యోగాల్లో ఉండాలా లేదంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలకు వెళ్లిపోవాలా అనే కోణంలో సచివాలయ ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించే జాబ్ కేలండర్ తోపాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే మంచిదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. కారణం వీరికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు తేడా ఉండటం, విధులు, జీతాలు, పదోన్నతులు, ప్రొబిషన్ ఇలా ఏ కోణంలో చూసిన సాధారణ ఉద్యోగులతో వీరిని పరిగణించడానికి ఆస్కారం లేకుండా పోతుందని చెబుతున్నారు. అటు చాలా జిల్లాల్లో వీరి ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియకుండా ఉందని..ఇప్పటికే హైకోర్టు పంచాతీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకనే ఒక కేసు విషయంలో ప్రశ్నించింది.. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం ప్రొభిషన్ లోనే 15వేలు మాత్రమే జీతం వస్తుంటే ఇక రెగ్యులర్ అయిన తరువా పెద్దగా జీత బత్యాలు ఏమొస్తాయోనని ఉద్యోగులంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రత్యేక జీవోల ద్వారా క్లారిటీ ఇవ్వకపోతే చాలా మంది ఇక్కడి ఉద్యోగాలను వదిలి ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ ఏడాది చివరి నాటికి సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ పూర్తయి వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి. అప్పటికైనా ప్రభుత్వం వీరి పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి..!