ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాఖల వారీగా ప్రత్యేక జీఓల ఆధారంగా వారికి అనంగా చేర్చిన విధులు, సేవలను తెలియజేస్తుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలుగా వున్న వారిని జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మార్చడంతోపాటు కాఖీ యూనిఫారం ఇచ్చింది. దానిని అన్ని జిల్లా ఎస్పీలు అమలు చేస్తున్నారు. ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శిలకు జీఓనెంబరు 650ని విడుదల చేసింది. అందులో సచివాలయ ఉద్యోగులు ఏవిధంగా పనిచేయాలనే విషయం తెలియజేయడంతో వాటిని రాష్ట్రంలోని అన్ని పట్టణ పురపాలక శాఖల కమిషనర్లకు కూడా తెలియజేయడంతో ఉద్యోగులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దశల వారీగా జీఓల ద్వారా విధులును తెలియజేసే పనిలో పడింది. గతంలో ఉద్యోగులు విధుల్లో చేరినపుడు వీరందరికీ ఒక జాబ్ చార్ట్ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ద్వారానే తెలియజేసింది. ఇపుడు ప్రత్యేకంగా శాఖల వారీగా జీఓల రూపంలో కొత్తగా రూపొందించిన విధులను తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను 545కి పెంచిన నేపథ్యంలో ఉద్యోగుల విధులు కూడా ఆయా ప్రభుత్వ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా కొత్తగా తయారు చేస్తుందని రాష్ట్ర అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారానే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతోనే కొత్తగా రూపొందించిన విధులను అధికారిక జీఓల ద్వారా తెలియజేస్తుందని వివరించారు. దానికితోడు, సమాచార హక్కుచట్టాన్ని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావించిన తరుణంలో సచివాలయ వ్యవస్థలో దాపరికంలేని సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో ఉద్యోగులకు చెందిన విధులను ఆయాశాఖల ముఖ్య కార్యదర్శిల ద్వారా జీఓలు విడుదల చేయిస్తుందని చెబుతున్నారు. సచివాలయానికి వచ్చిన దగ్గర నుంచి శాఖల వారీగా ఎంతమంది సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారనే విషయంలోనూ ఇకపై ప్రభుత్వం లెక్కలు తేల్చనుందని సమాచారం అందుతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా సమస్యలు గ్రామస్థాయిలో పరిష్కారం కావడం లేదు. సచివాలయ సిబందే మండల, జిల్లా కార్యాలయాలకు పంపుతున్నారు. కొన్నింటిని సచివాలయాల్లో చేసే అవకాశం వున్నా సక్రమంగా చేయడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే కొత్తగా జీఓల రూపంలో విధులు ఉటంకిస్తూ జీఓలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, పరిష్కరించినవి ఎన్ని అనే విషయాలను డాష్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వంలోని ముఖ్యశాఖల అధిపతులే సమీక్షనున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా వ్యవశాఖ, పట్టు పరిశ్రమశాఖ, ఉద్యానశాఖ, ఇంజనీరింగ్, సంక్షేమశాఖ, వీఆర్వోలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శిలకు కూడా కొత్త విధులపై జీఓలు ప్రభుత్వం జారీచేయనుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో గ్రామంలోనే సేవలు అందాలంటే ఉద్యోగులకు జాబ్ చార్ట్ లిఖిత పూర్వకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. అన్నిశాఖల సిబ్బందికి వారి వారి విధులు, సేవలపై ప్రత్యేక జీఓలు వస్తే తప్పా..కొత్తగా వారి విధుల్లో ఏఏ కొత్త సేవలు అదనంగా చేర్చారనే విషయం కొలిక్కిరాదు..!