తెరపైకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు అంశం..


Ens Balu
4
Tadepalle
2021-07-05 04:04:15

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, మెగా గ్రౌండింగ్ పేరుతో నిర్మాణాలు చేపడుతున్న వేళ  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇచ్చిన ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని ఉద్యోగులంతా తెరపైకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు సీఎం ఇచ్చిన హామీ అరిచేతిలో ఇంటిలాగే ఉంటుందా..అంటూ.. వారి యూనియన్ గ్రూపుల్లో పెద్ద చర్చకు తీసుకు వస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తాయని..వారు ఆనందంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయని ఆలోచిస్తాయని...కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్దంగా జరుగుతుందని బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, 8 డిఏలకు మోక్షం లేదని, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ వస్తుందో రాతో తెలియడంలేదని, ఇపుడు ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న ఇంటి స్థలాలు, ఇల్లు కట్టించి ఇస్తామన్న హామీ కూడా నెరవేరేలా లేదని ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజలు చేసిన హామీలకంటే అధికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి పట్టండ కడితే కనీసం ఈ ప్రభుత్వ హయాయంలో నైనా తమ సొంతింటి కల నెరవేరుతుందనుకుంటే.. ప్రభుత్వంలోని నిధులన్నీ ప్రజలకు నగదు రూపంలో సంక్షేమ పథకాలకే వచ్చి..నేడు నెల నెలా జీతాలకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే పరిస్థితి దాపురించిందని మదన పడుతున్నారు. నేటికి చాలా మందికి ప్రసూతి సెలవుల జీతాలు, గత పీఆర్సీ బకాయిలు, ఐఆర్ బకాయిలు ఇవ్వలేదని, చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని చెబుతన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సొంతింటి కల హామీ ఇంకెక్కడ నెరవేరుతుందని పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో నేటికీ చాలా భవనాలు శిధిల స్థితికి చేరుకున్నాయి. చాలా చోట్ల డిస్పెన్సరీలు, ఆసుపత్రులు పడిపోయాయి. వాటి స్థానంలో నాడు నేడు క్రింద వైద్య ఆరోగ్యశాఖలో ఆసుపత్రులు మాత్రమే కడుతున్నారు తప్పా ప్రభుత్వశాఖల ఉద్యోగులు 50ఏళ్ల క్రితం కట్టిన ప్రభుత్వ భవనాల్లోనే విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని వాపోతున్నారు. ఉన్న స్థలాలన్నీ నిరుపేదలకు ప్లాట్లు వేసి ఇచ్చేస్తుంటే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఎక్కడి నుంచి తెస్తారని..ఒక వేల ప్రైవేటు స్థలాలు కొనాలంటే ప్రభుత్వ ఖజానాలో సొమ్ములేదని చేతులెత్తేయడానికే ఈ విధంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చించుకుంటున్నారు. కనీసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలనైనా రెగ్యులర్ చేస్తుందా అని అనుకుంటే అదీ జరలేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఉద్యోగులు తీవ్రంగా మదన పుడుతన్నారు. టిడిపిని కాదని వైఎస్సార్సీపీకి మద్దత్తు ఇచ్చినందుకు కనీసం ఒక్క హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయకపోగా..ప్రధాన సమస్యలు, డిమాండ్లు కూడా నెరవేరలేదని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ముందుకి తమకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీసుకువస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం వలన రాబోయే రోజుల్లోనైనా అమలు చేస్తారో లేదోనని పెదవి విరుస్తూ నాటి వైజగ్ ఉద్యోగులకు ఇస్తామన్న ప్రచార వీడియోని వైరస్ చేస్తున్నారు..మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగులకి ఇచ్చిన సొంతింటి హామీ, డిఏలు, పీఆర్సీ బకాయిలను తీరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!