GO149పై గ్రేడ్-5 కార్యదర్శిలు తాడోపేడో..


Ens Balu
11
Tadepalle
2021-07-07 01:17:45

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్రస్థాయిలో కమిషనర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ సచివాలయాల కోసమే ప్రత్యేకంగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు, డిపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు కనీసం పట్టించుకోవడం లేదనే విషయం జిఓనెంబరు 149 సాక్షిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జీఓ ప్రకారం పంచాయతీలో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ వారి పరిధిలోని రికార్డులను, సిబ్బందిని, అధికారాలను, నిధులను బదలాయించాల్సి వుంది. కానీ రెండేళ్లు దాటినా  సచివాలయ కార్యదర్శిలకు ఆ అధికారం రాలేదు.. కాదు కాదు జిల్లా అధికారులు గట్టిగా ఆదేశించకపోవడంతో గ్రేడ్-2 కార్యదర్శిలు ఇవ్వడం లేదు. దీనితో చేతికి అధికారం ఇవ్వకుండా విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిల తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం, లక్ష్యంతో ఒక ప్రత్యేక నెంబరుతో ఇచ్చిన ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. కోర్టు ద్వారా మొట్టికాయలు తినేలా చేస్తున్నాయి.. ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు, అమలు చేయకుండా వదిలేసిన జీఓలు, పంచాయతీరాజ్ చట్టాలను పాటించని వైనంపై పంచాయతీలుండగా.. అసలు సచివాలయాలు ఎందుకు అనే స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిందంటే ప్రభుత్వం జీఓల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇచ్చిన జీఓను అమలు చేయకుండా ఎందుకు మిన్నకుండిపోతుందో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విధుల వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జారీ చేసిన జీఓనెంబరు 149 నేటికీ అమలు కాకపోవడం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మేజర్ పంచాయతీల్లో ఏర్పడిన గ్రామ సచివాలయ గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చేయాలి.  కానీ ప్రభుత్వం వీరికి అధికారాలు ఇవ్వకుండా, వున్న గ్రేడ్-2 కార్యదర్శిల వద్దే నిధులు, రికార్డులు, అధికారాలు ఉంచేసింది. దీనితో గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటుతున్నా గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా పనిచేయాలో, ఏ అధికారంతో పనిచేయాలో, తమ జాబ్ చార్ట్ ఏంటో తెలియక పంచాయతీ కార్యాలయాలవైపు అమాయకంగా చూస్తున్నారు. ఇదే విషయమై గత ఆరునెలల నుంచి వీరంతా మండల స్థాయిలో ఎంపీడీఓలకు, జిల్లా స్థాయిలో డీపీఓలకు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ కు తమ అధికార బదలాయింపుపై వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీనితో మూడు నెలల క్రితం వీరి అధికారాలను లాగేస్తూ వీఆర్వోలకు డిడిఓ అధికారాలను కట్టబెట్టింది ప్రభుత్వం. అప్పటి వరకూ ఏదో తమకు అధికారాలు, తమ సచివాలయ పరిధిలోని రికార్డులు, నిధులు, పారిశుధ్య సిబ్బంది తమకి ఇస్తారనుకొని ఆశపడ్డారు.. ప్రభుత్వం ఇటీవల నియమించిన కార్యదర్శిలంతా. కానీ అదిజరగక పోగా మళ్లీ ఆ డిడిఓ అధికారాలు కార్యదర్శిలకే ఉంచాలని, అవి కూడా రెండు నెలలపాటు ఉండాలని ఉత్తర్వులు జారీచేశారు. ఇన్ని చేసిన ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓనెంబరు 149పై నేటి వరకూ కనీసం నోరు విప్పలేదు. దీనితో విసుగు చెందిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా తమ ఆందోళనను ఉద్యమంగా మార్చాలని నిర్ణయించుకొని తమ న్యాయపరమైన డిమాండ్ ను నెరవేర్చాలంటూ ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా వున్న ఎమ్మెల్యేలను కలవడం మొదలు పెట్టారు. వీరిచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యేలు ఆ జీఓను అమలు చేయాల్సింది డీపీఓలు కదా..  ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఆదేశించలేకపోతున్నారు.. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ఎందుకు చొరవ చూపింలేకపోతున్నారు అని తిరిగి ప్రశ్నిస్తుండటంతో గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఎమ్మెల్యేల ముందు బిక్క మొహం వేస్తూ... అదే మా దౌర్భాగ్య పరిస్థితి అంటూ వారి ముందే నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అసలు పంచాయతీ కార్యదర్శి అని విధుల్లో చేరిన మాకు ఏ విధులు ఉంటాయో నేటికీ ప్రభుత్వం తెలియజేయకపోవడం, ప్రభుత్వమే ఇచ్చిన 149 లాంటి జీఓలను అమలు చేయకపోవడం వలనే ఈ పరిస్థితి దాపురించిందని తమ గోడును వెల్లదీసుకుంటున్నారు కార్యదర్శిలు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అందరు ఎమ్మెల్యేలను కలిసి తమ పోరాటంలో తాడో పేడో తేల్చుకోవడానికి సచివాలయ కార్యదర్శిలు సిద్దమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాజిల్లాలోని అవనిగడ్డ ఎమ్మెల్యేకి తమ సమస్యను విన్నవించి వినపతి పత్రం సమర్పించారు.  ఆ తరువాత అన్ని జిల్లాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన గ్రామ సచివాలయ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శిల రూపంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోయినా, అమలు జరగక పోయినా.. న్యాయపరంగా వెళ్లి తమ న్యాయపరమైన డిమాండ్లను, జీఓ నెంబరు 149 ద్వారా వచ్చే అధికారాలను, జాబ్ చార్ట్ ను సాధించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 8వేల మంది గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కార్యాచరణ సిద్దం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో పంచాయతీలను పట్టి వదలకుండా.. సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు వారి పరిధులను పంచకుండా, రికార్డులు ఇవ్వకుండా వారిదగ్గరే ఉంచుకొని జాబ్ చార్ట్ ను కూడా అమలు చేయకుండా.. పక్క పంచాయతీలకు సైతం ఇన్చార్జిలుగా వ్యవహరించే గ్రేడ్-2 కార్యదర్శిలను, వారి ద్వారా జీఓ 149 అమలు చేయని జిల్లా పంచాయతీ అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా తేలాల్సి వుంది. కలెక్టర్లు స్పందిస్తారా.. గ్రామ సచివాలయ జెసిలు ద్రుష్టిపెడతారా అసలేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..!