పాడేరు ఐటిడిఏ పరిధిలో ప్రసవానికి డోలీలో తీసుకు వెళ్తున్న గర్బిణిస్త్రీ తోపాటు ఆమెబిడ్డ కూడా మరణించిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి బుధవారం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జి.మాడుగుల మండలం గెమ్మెలిబారు గ్రామానికి చెందిన కొర్రా జానకి (25) అనే గిరిజన మహిళను కాన్పుకోసం గిడుతూరు గ్రామం నుంచి జి. మాడుగుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించిన ఆమహిళతోపాటు బిడ్డ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ సంఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తల్లీబిడ్డల మరణంపై విచారణచేసి నివేదిక సమర్పించాల్సిందిగా బుధవారం పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఆదేశించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో రహదారులు లేని గిరిశిఖర గ్రామాలలో గర్బిణిస్త్రీలకు సంభందించిన సమాచారాన్ని సేకరించి అవసరమైన వారిని ముందుస్తుగానే కాన్పుకోసం ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రహదారులు లేని కారణంగా డోలీలను ఇప్పటికీ వినియోగిస్తున్న గిరిజన గ్రామాల సమస్యలను తీర్చడానికి, డోలీల సమస్యను శాశ్వితంగా పరిష్కరించటానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించామని వెల్లడించారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.గోపాలక్రిష్ణ వెంటనే స్పందించారు. మాత శిశు మరణాలు జరగ కుండా తగిన చర్యలు చేపడతామన్నారు. కొర్రా జానకి మృతి పై సమగ్రమైన విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు జిల్లా వైద్యాధికారి ని విచారణ అధికారిగా నియమించారు. రెండు రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 9వతేదీన వైద్యాధికారులు,108 వాహన యాజమాన్యం, ఫీడర్ అంబులెన్సుల నిర్వాహకులు తో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిగర్భిణీ స్త్రీలు వసతి గృహం నిర్వహణ , ఐసిడిఎస్ సేవలపై సీడీపీవోలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.