గ్రామ రక్షణ ఇక మరింత పటిష్టం..


Ens Balu
2
తాడేపల్లి
2021-07-08 01:19:35

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గ్రామాల పటిష్టత మరింతగా పెరగనుంది. జీఓనెంబరు 59 ద్వారా గ్రామ సంరక్షణా కార్యదర్శిలుగా వున్నవారిని ప్రభుత్వం సాధారణ పోలీసులుగా గా మార్చడంతో గ్రామంలో సచివాలయానికి ఒకరు చొప్పున రక్షణగా నిలవనున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లలేని మహిళలకు గ్రామస్థాయిలో సేవలు అందించడానికి మహిళా పోలీసులు సచివాలయం దగ్గర నుంచే స్టేషన్ వరకూ బాధితుల తరుపున ఫిర్యాదులు పంపిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లోని అల్లర్లు జరగకుండా, గొడవలు రేగకుండా చూసేందుకు వీరికి ప్రభుత్వం సాధారణ పోలీసులు మాదిరిగా పోలీస్ డ్రెస్ ఇవ్వడంతో గ్రామాలకు ఖాకీ పవర్ ఎంతో పటిష్టం కానుంది. ఇప్పటికే వీరందరికీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎస్ఈబీ), పోలీస్ స్టేషన్లు, మండల కార్యాలయాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో శిక్షణ పూర్తయింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో శిక్షణ తీసుకున్న అనంతరం వీరంతా దశల వారీగా క్యాప్సూల్ శిక్షణ కూడా తీసుకుంటారు. ఒంటికి ఖాకీ చొక్కా..చేతిలో లాఠీ పట్టుకొని గ్రామాల్లో అనునిత్యం పహాకాస్తూ ప్రజలకు రక్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చి దిశ యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయి నుంచి వార్డు, పట్టణాల్లో సైతం యాప్ ను విరివిగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేయించే విషయంలో మహిళా పోలీసులు చాలా కీలకంగా వ్యవస్తున్నారు. సాదరణంగా పోలీసులైతే ఒక్క స్టేషన్ విధులకే పరిమితం అవుతారు. కానీ రాష్ట్రప్రభుత్వం వీరిని ప్రత్యేకంగా నియమించడంతో గ్రామ రక్షణతోపాటు, ఐసిడిఎస్, వైద్యం, ఎన్నికల విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ సమయంలో మహిళా పోలీసులు పోషించిన ప్రత్యేక పాత్ర కారణంగా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో అత్యధికంగా మహిళలు, బాలింతలు, ప్రస్తుతం గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా అందింది. తద్వారా కరోనా వైరస్ అధికం కాకుండా కాపాడటంలో వీరు ఎంతో కీలకంగా వ్యవహరించారు. రానున్న రోజుల్లో వీరు సచివాలయ పరంగా మరిన్ని విధులు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏవైనా గొడవలు జరిగితే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా గ్రామంలోని సచివాలయం కేంద్రంగా ఫిర్యాదులు సమర్పించడంతోపాటు, అత్యవసర సమయంలో వీరిని నేరుగా సంఘటనా స్థలాలకు తీసుకెళ్లే వెసులు బాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కల్పించడం శుభపరిణామ మని గ్రామాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలకు మహిళా పోలీసులు కవచంలా ఉంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్, కేంద్రం అమలు చేస్తే దిశ చట్టానికి కూడా కార్యరూపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సంరక్షణకు మహిళా పోలీసులు ఒక ప్రత్యేక కవచంలా  తయారుచేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ విధానంతో గ్రామాలు, పట్టణాల్లో మహిళా పోలీసులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు రక్షణగా నిలవనున్నారు..!