ఆంధ్రప్రదేశ్ లో కార్డు (అక్షరం రాయడం రాకపోయినా వైట్ అండ్ వైట్ డ్రెస్సేసుకొని కలరిచ్చే) జర్నలిస్టుల ను నియంత్రణ చేయాలంటే అక్రిడిటేషన్ల జీఓలో మార్పులు మాత్రమే చేస్తే సరిపోదని.. విద్యార్హతల విషయంలో గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చినట్టు కనిపిస్తుంది. మండల కేంద్రాల్లో ఖచ్చితంగా ఇంటర్, జిల్లా కేంద్రాల్లో డిగ్రీ, స్టాఫ్ రిపోర్టర్లకు జర్నలిజంలో డిప్లమాలేదా, డిగ్రీ, పీజీ కోర్సులను అర్హతలుగా చేసి పక్కాగా అమలు చేస్తే ఆటోమేటిక్ గా కార్డు జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దానినే నిజం చేస్తూ.. ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశరాజధాని డిల్లీలోని పిఐబి అక్రిడిటేషన్ కు కూడా లేని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ విషయంలో కోర్టు నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు పొందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి ప్రెస్ అక్రిడిటేషన్లకు సుమారు 40వేల మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. గత ఏడాది అక్రిడిటేషన్ల సంఖ్య చూస్తే కేవలం 28వేల మందికే మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ తరుణంలో కార్డు జర్నలిస్టులు అధికమై పోయారని.. అందులో వర్కింగ్ జర్నలిస్టులను మాత్రమే గుర్తించి కార్డు లేదా నకిలీ జర్నలిస్టులను పూర్తిగా ఏరిపారేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతుంది. దీనికోసం ప్రభుత్వం అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు తావులేకుండా చేయడంతో పైచేయి సాధించింది ప్రభుత్వం. వాస్తవానికి జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ జర్నలిస్టు సంఘాలకు నాయకులమని చెప్పుకునే వారికి ప్రభుత్వం విడుదలచేసిన జీఓ కాపీలను ఇంగ్లీషులో చదివి..ఆపై జిల్లా చైర్మన్ కు అందులోని లోటు పాట్లను చెప్పే సామర్ధ్యం లేనివారే అధికంగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులు ఉంటూ వస్తున్నారు. దీనితో ఇలాంటివారికి చెక్ పెట్టాలంటే ముందు వారికి సమావేశాల్లో ప్రాతినిథ్యం లేకుండా చేసింది ప్రభుత్వం. దెబ్బతికి అక్రిడిటేషన్ కమిటీల్లో ఆ..తరహా జర్నలిస్టులకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్న, మధ్యతరహా పత్రికలు, ప్రధాన పత్రికలు, న్యూస్ టీవీ ఛానళ్లు, లోకల్ కేబుల్ టీవీలు, న్యూస్ ఏజెన్సీలకు జిఎస్టీ మెలిక పెట్టింది ప్రభుత్వం. నిత్యం పత్రికలు ముద్రించాలని..ఎన్ని పత్రికలు ముద్రిస్తున్నారో దానికి అనుగుణంగా జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయాలని, క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో పెట్టాలని, విద్యార్హతలతోనే మీడియా సంస్థలకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేయాలన్ని ప్రస్తుతం సమాచారశాఖ ప్రధాన నిబంధన. పెద్ద పత్రికలు జీఎస్టీ రిటర్న్స్, క్లిప్పింగులు, ఇతర అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నవారికి, టివి ఛానళ్లకు అపుడే అక్రిడిటేషన్లకు లైన్ క్లియర్ అయిపోయాయి. అయినప్పటికీ అలా మంజూరైన వారిలోనూ.. ఇంకా కనీస విద్యార్హత లేనివారు చాలా మందే ఉన్నారని అలాంటి వారిని పూర్తిగా వడపోసి వర్కింగ్ జర్నలిస్టులను గుర్తిస్తూ వారికే అక్రిడిటేషన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా సమాచారశాఖలోని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న విద్యార్హతల విషయంలో ప్రధాన జర్నలిస్టు సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో వారికి సర్ధిచెప్పి.. ఎలాగైనా కనీస విద్యార్హతలు నిర్ణయించి దానిని అమలు చేయాలని భావిస్తుంటద సమాచారశాఖ. అదే జరిగిగే రాష్ట్రంలోని చాలా మంది కార్డు/నకిలీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పొందే అర్హత రాదు. అలాగని మీడియా సంస్థలు అక్రిడిటేషన్లు అమ్ముకోవాలని చూసినా ఆ ప్రయత్నం కూడా ఫలించకుండా ఈ ప్రభుత్వంలోనే కఠిన చర్యలు తీసుకొని వర్కింగ్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా పత్రికలను కూడా ఒకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రిడిటేషన్ల మంజూరు ఆలస్యమైందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కోర్టులో ఈ విషయం ఉండటం ఆలస్యం అమవడం ఒక కారణమైతే..తప్పకుండా జర్నలిస్టుల విద్యార్హత, నిజమైన జర్నలిస్టులను గుర్తించే కార్యక్రమం అమలు చేయకపోతే కార్డుకోసం..పైరవీలు చేయడం కోసం అక్రిడిటేషన్లు తీసుకునే వారు ఎక్కువైపోతారనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు ముద్రించలేనివారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వలేదు. జీఓ ప్రకారం అనుబంధ పత్రాలు ఆన్ లైన్ అప్లోడ్ చేస్తే అక్రిడిటేషన్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది సమాచార శాఖ. గతంలో న్యూస్ ఏజెన్సీలు ఒక లేఖ ఇస్తే అక్రిడటేషన్లు ఇచ్చేవారు. ఇపుడు వారు కూడా ఇతర మీడియా సంస్థల మాదిరిగానే అనుబంధ ధ్రువపత్రాలు ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంది. అలా చేసిన వారి దరఖాస్తులే పరిగణలోనికి తీసుకుంటామని కూడా చెబుతోంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణలో ఈ విద్యార్హత పక్కాగా అమలు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనిని కాస్త గట్టిగానే అమలు చేసేలా కనిపిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఇప్పటికే సమాచారశాఖ మంత్రి పేర్నినాని ఇదే నకిలీ, అర్హతలేని జర్నలిస్టుల విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఎప్పుడు జర్నలిస్టుల సంఘాలు కలిసినా ప్రస్తావించడం కూడా ఇపుడు జర్నలిస్టుల విద్యార్హత విషయానికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం జర్నలిస్టుల విద్యార్హత విషయంలో కట్టుబడి వుంటుందా..లేదంటే జర్నలిస్టు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా..ఎప్పటిలాగే కాలం వెళ్లదీస్తూ ఉండిపోతుందా..?!